వచ్చే ఎన్నికల విషయంలో తన తనయుడిని గట్టిగానే ప్రొజెక్ట్ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అదే వేరే విషయంలో మాత్రం నో ఛాన్స్ అంటున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేనల జాయింటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడే ఉంటారని స్పష్టం అవుతోంది. చంద్రబాబును సీఎంగా చేయడానికే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు కూడా. లోకేష్ ను ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణించడం లేదు చంద్రబాబు వ్యూహాత్మకంగా. లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే అధికారాన్ని ఇప్పటికప్పుడు మరోసారి జగన్ కు రాసిచ్చినట్టే. అందుకే చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే టాక్ ను అలాగే ఉంచుతున్నారు. కానీ చంద్రబాబు కు వయసుతో ఇబ్బందులు చాలానే ఉన్నట్టున్నాయి. ప్రత్యేకించి మాటతీరు చాలా తేడా వచ్చేసింది.
ఏదేదో మాట్లాడతారు. అన్నీ అయిపోయాకా.. అదంతా తెలుగుదేశం పార్టీ వల్లనే అంటూ ముగిస్తారు. ప్రపంచంలోని సోదంతా చెప్పి, చివర్లో అదంతా తన వల్లనే అంటూ చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. మరి ఈ ప్రసంగాలు దశాబ్దాలు వినీవినీ జనాలు విసిగిపోయారు. అయితే చెప్పుకునే చంద్రబాబుకు మాత్రం విసుగు రావడం లేదు, బహుశా రాదు కూడా! అదే కాదు.. తనేం మాట్లాడుతున్నది కూడా తను గ్రహించే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. సైకిల్ పోవాలి అనడం, రిగ్గింగ్ చేసుకోవడానికి తను తిరుపతి వెళితే అడ్డుకున్నారని అనడం.. ఇదంతా చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానం రేకెత్తిస్తోంది.
సాధారణంగా మన సమాజంలో 70 దాటిన వారిని వృద్ధులుగానే పరిగణిస్తారు. దశాబ్దాలుగా మన సామాజిక పరిస్థితులను గమనిస్తే.. 70 తర్వాత ఇంటి పట్టున ఉండటం మంచిదనేది సర్వత్రా ఉన్న అభిప్రాయం. అది ఏ వృత్తివారైనా అంతే! 58 దాటితేనే వృత్తులకు పనికి రారనే కదా.. రిటైర్మెంట్ పరిమితిని పెట్టడం. ఒకవేళ అప్పటికీ వారు సమర్థులే అనుకున్నా.. శారీరకమైన సమస్యలు ఉంటాయి. మానసికంగా స్ట్రాంగ్ గానే ఉన్నా.. శారీరక సమస్యలతో చాలా మంది వృత్తికి దూరం అవుతూ ఉంటారు. ఇక వ్యవసాయం వంటి పనులు చేసే వాళ్లైతే 60 తర్వాత పెద్దరికం నుంచి కూడా తప్పుకుంటారు!
కొడుక్కు పూర్తి బాధ్యతలు అప్పగించేసి అన్ని విధాలుగానూ రిటైర్ అవుతారు, మనవళ్లు, మనవరాళ్లను చూసుకోవడమే, వారితో ఆడుకోవడమో చేస్తూ గౌరవం నిలబెట్టుకుంటారు. శారీరకంగా సమర్థత తగ్గిపోయాకా.. ఇక లేని పోని పెద్దరికం చేసి పరువు పోగొట్టుకోకూడదనేది రైతు పని చేసిన వారికి తెలిసిన విషయం. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళుతూ.. రచ్చబండ మీద సవాళ్లు చేస్తూ వీరు పొద్దు గడుపుతూ ఉంటారు. చిన్న చిన్న వ్యవసాయ పనుల్లో ఇన్ వాల్వ్ అవుతారు తప్ప అంతకు మించి ఇక పనులు పెట్టుకోరు. అది కూడా 60 యేళ్ల వయసు వారి పరిస్థితి!
ఇక చంద్రబాబు వయసు వాళ్లతో అయితే అవతలి వారు మాట్లాడటం కూడా కష్టం! చెప్పిందే చెప్పడం, చాదస్తపు మాటలు చెప్పడం, తామేం మాట్లాడుతున్నామో గ్రహించలేకపోవడం.. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉంటారు. ఇండియాలో ఈ వయసు వారి మానసిక స్థితుల మీద పరిశోధనలు కూడా సాగుతూ ఉంటాయి. తెలిసో తెలియకో.. ఈ వయసు వారు ఇండియాలో చాలా మంది స్క్రిజోఫ్రెనియా బాధితులే అని కొన్ని పరిశోధనలు చెబుతూ ఉంటాయి. ఇదొక మెంటల్ డిజార్డర్. మతిమరుపు, చెప్పిందే చెప్పడం, మాటల మీద మెదడు నియంత్రణ లేకపోవడం, ఏం మాట్లాడుతున్నదీ గ్రహించలేకపోవడం, చాదస్తంగా ప్రవర్తించడం, ఈ చాదస్తం ఒకరకంగా ఉండదు!
70 దాటిన భారతీయుల్లో చాలా మంది తమకు తెలియకుండానే ఈ తరహా బాధితులు అయి ఉంటారని, ఇలాంటి వారు కానీ, వారి కుటుంబీకులు కానీ ఆ విషయాలను తెలుసుకునేంత స్థాయిలో మన వద్ద వైద్య శాస్త్రం చేరువ కాలేదని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఈ తరహా మానసిక స్తితిలో ఉన్న వారికి మరొక తోడు అవసరం. మాటలు, చేష్టలపై మెదడు నియంత్రణ లేకపోవడం వయసుతో పాటు వచ్చే మార్పే. ఇలాంటి వారు తమ గురించినే తాము సరిగా నిర్ణయాలు తీసుకోలేరు, తమ పనులు తాము చేసుకోలేరు. అలాంటి వారి చేతిలో ఒక నియోజకవర్గం వ్యవహారమో, లేక ఒక రాష్ట్రం భవితవ్యమో ఉండటం ఎంత వరకూ సమంజసమో అనేది తేలికగా అర్థం చేసుకోదగిన అంశమే. అలాగే ఈ స్క్రిజోఫ్రెనియా కుటుంబ తరహా వారసత్వం కూడా!
మరి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తో సహా 70-75 యేళ్ల వయసు వారు మరింతమంది ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. వీరిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా! అలాగే తన పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో రాజకీయ వారసుల కు అవకాశాలు తక్కువగా ఇవ్వనున్నారట చంద్రబాబు. వయసు మీద పడినా కూడా వృద్ధులకు, 70 దాటిన వారికే టికెట్లు తప్ప, 40ల వయసులోకి వచ్చిన వారి తనయులకు అవకాశం ఇవ్వరట. లోకేష్ కు తప్ప చాలా మంది రాజకీయ వారసులకు టికెట్లు దక్కవని, కదల్లేని, మెదల్లేని స్థితికి చేరిన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లకే టికెట్లు దక్కుతాయి తప్ప అలాంటి వారి తనయులకు టికెట్లు కేటాయించేందుకు కూడా చంద్రబాబు నో చెబుతున్నారట.
2019 ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది రాజకీయ వారసులు టికెట్ పొందారు. వారంతా గంపగుత్తగా ఓడిపోయారు కూడా. ఈ నేపథ్యంలో తండ్రులకే టికెట్ తప్ప.. తనయులకు ఈ సారి అవకాశం ఇచ్చేది లేదని చంద్రబాబు ఖరాఖండిగా చెబుతున్నారట!