కొండంత ఆశయాన్ని నెరవేర్చేందుకు సుదీర్ఘ ప్రయాణానికి కుప్పం కేంద్రంగా నారా లోకేశ్ ముందడుగు వేశారు. లోకేశ్ నడక, టీడీపీని అధికారం వైపు నడిపిస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశ పెట్టుకున్నారు. లోకేశ్ నడక మూడో రోజులు పూర్తి చేసుకుంది. పాదయాత్రపై అప్పుడే అంచనాలు, అభిప్రాయాలు మొదలయ్యాయి. సహజంగానే టీడీపీ శ్రేణులు ఫర్వాలేదని అంటుంటే, ప్రత్యర్థులు, తటస్థులు మాత్రం పెదవి విరుస్తున్నారు.
మరీ ముఖ్యంగా నారా లోకేశ్ నడతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్ బజారు భాషను వాడుతూ తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆయనకు వినే ఓపిక లేనట్టు కనిపిస్తోందనే వాళ్లు లేకపోలేదు. ఉదాహరణకు పాదయాత్రలో భాగంగా బీసీలతో లోకేశ్ సమావేశమయ్యారు. టీడీపీ కార్యకర్త భానుమూర్తి మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందక బీసీలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. అలాగే కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని, మీకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని నిర్భయంగా చెప్పారు. వాస్తవాలే చెబుతున్నానని, ఎవరేమనుకున్నా భయం లేదని తేల్చి చెప్పారాయన.
లోకేశ్ తెలివైన నాయకుడైతే… ఇలాంటివి ఏవైనా వుంటే తనకు వ్యక్తిగతంగా చెప్పాలని కోరేవారు. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్ పర్సన్ వనితమ్మ ఏం పీకుతోందని ప్రశ్నించడం ఆశ్చర్యపరుస్తోంది. కనీసం ఒక మహిళ గురించి విమర్శలు చేయడంతో సంస్కారవంతమైన భాష వాడాలనే ఇంగితం కూడా లేకపోవడం సొంత పార్టీ వాళ్లను కూడా నివ్వెరపరిచింది. వనితమ్మను విమర్శించడం ద్వారా ఆమె స్థాయి పెరిగి, తన స్థాయిని లోకేశ్ తగ్గించుకున్నట్టైంది.
అలాగే రోజాపై విసుర్లు కూడా అంతే. ఏం డైమండ్ పాప అని మాట్లాడ్డం మహిళల విషయంలో తన కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నట్టైంది. మరీ ముఖ్యంగా లోకేశ్ పదేపదే అంటున్న మాట గురించి కూడా చెప్పుకోవాలి. తన తండ్రి చంద్రబాబు నాయుడిలా మంచి వాడిని కాదని, మూర్ఖుడినని ప్రత్యర్థులను హెచ్చరిస్తుంటారు. ఈ మాట లోకేశ్ అదే పనిగా చెప్పాల్సిన పనిలేదు. పద్ధతులను చూసి మూర్ఖుడివో, తెలివైన వాడివో జనం నిర్ణయించుకుంటారు.
ప్రత్యర్థులపై తీవ్రమైన రాజకీయ విమర్శలు చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ తిట్లకు దిగితే, ప్రత్యర్థులు అంతకు మించి ఎదురు దాడి చేస్తారని లోకేశ్ గ్రహించాలి. ముఖ్యంగా నాయకుడిగా ఎదగాలని నడక ప్రారంభించిన లోకేశ్ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మాదిరిగా మాట్లాడితే, భవిష్యత్‌లో వారసుడిగా కావడం దేవుడెరుగు భారమవుతావని గుర్తించుకోవాలి. సంస్కార హీనంగా మాట్లాడే వ్యక్తులను ఎప్పటికీ సమాజం నాయకుడిగా ఆమోదించదు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ఒకట్రెండు సందర్భాల్లో తప్ప జగన్ ఎప్పుడూ తన స్థాయిని దిగజార్చుకునేలా దూషణలకు దిగకపోవడాన్ని లోకేశ్ గుర్తించుకోవాలి. అంతెందుకు, పవన్‌కల్యాణ్‌ను దత్తపుత్రుడనే విమర్శ తప్ప, మరో మాట మాట్లాడరు. పవన్‌కు కోపం కూడా అదే. కనీసం తన పేరైనా సీఎం నోట రావడం లేదని పవన్ తెగ బాధపడిపోతున్నారు.
ప్రత్యర్థులను తిట్టడం, వారితో తిట్టించుకోవడమే పాదయాత్ర లక్ష్యమైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజాసమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడితే ఆదరణ చూరగొంటారు. అయితే ఎక్కువ కాలం పాలించిన తన తండ్రి చంద్రబాబు నాయుడే అన్ని పాపాలకు మూలకారకుడని లోకేశ్‌కు నెమ్మదిగా తెలిసొస్తుంది. అమూల్ కోసం ప్రభుత్వ డెయిరీలను బలి పెట్టారని తాజాగా లోకేశ్ విమర్శలు చేయడం చూస్తే నవ్వొస్తుంది.
ఎందుకంటే తన సొంత డెయిరీ హెరిటేజ్ కంపెనీ కోసం ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీకి తన తండ్రి సమాధి కట్టారని చిత్తూరుకు వెళితే రైతులు కథలుకథలుగా చెబుతారు. కావున రానున్న రోజుల్లో నడత మార్చుకోకపోతే మాత్రం లోకేశ్ గొబ్బు పట్టడం ఖాయం. నడక అనేది కేవలం శారీరక ఎక్సర్‌సైజ్‌గా లోకేశ్ పరిగణిస్తే, అది ఆయన అజ్ఞానం అవుతుంది. నడత అనేది మానసిక, సంస్కారానికి సంబంధించిన అంశాలు. అవే నాయకుడిని మనిషిగా, నాయకుడిగా తీర్చిదిద్దుతాయి. పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి బస చేసే ముందు… ఆ రోజు తన వ్యవహారశైలిపై సింహావలోకనం చేసుకుంటే లోకేశ్‌కే మంచిది.