యాక్సిడెంట్ లో చనిపోయాడు..పోస్టుమార్టంలో బతికాడు

ప్రతి రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మరణిస్తున్నారు. కుటుంబాలకు తీరని వేదన మిగిలిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చిన ఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఇది అలాంటిదే. రోడ్డు ప్రమాదంలో…

ప్రతి రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది మరణిస్తున్నారు. కుటుంబాలకు తీరని వేదన మిగిలిస్తున్నారు. అయితే చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చిన ఘటనలు కూడా కొన్ని జరిగాయి. ఇది అలాంటిదే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన ఓ వ్యక్తి, పోస్టుమార్టం టైమ్ కు బతికాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన.

మొరాదాబాద్ లోని పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు 40 ఏళ్ల శ్రీకేష్ కుమార్. ఎప్పట్లానే విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న శ్రీకేష్ ను రోడ్డుపై వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. వెంటనే శ్రీకేష్ ను దగ్గర్లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

శ్రీకేష్ ను పరీక్షించిన వైద్యులు, అతడు మరణించినట్టు ధృవీకరించారు. డెడ్ బాడీని మార్చురీ ఫ్రీజర్ కు తరలించారు. మరుసటి రోజు పోస్టుమార్టం ఏర్పాటుచేశారు. అలా 7 గంటల పాటు మార్చురీ ఫ్రీజర్ లో ఉన్న శ్రీకేష్ బాడీని పోస్టుమార్టం కోసం బయటకు తీసుకొచ్చారు.

సరిగ్గా అదే టైమ్ లో అతడి శరీరంలో చిన్నపాటి కదలికల్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వైద్యులకు చెప్పడంతో వెంటనే అతడిని హుటాహుటిన ఐసీయూకు తరలించి వైద్యం అందించారు. దీంతో శ్రీకేష్ బతికి బయటపడ్డాడు.

చనిపోయాడని వైద్యులు ధృవీకరించిన తర్వాత, 7 గంటల పాటు ఫ్రీజర్ లో ఉండి కూడా శ్రీకేష్ బతకడాన్ని అద్భుతం అంటున్నారు వైద్యులు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. కుటుంబ సభ్యులు సదరు వైద్యులపై కేసు పెట్టారు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్టు ఎలా డిక్లేర్ చేస్తారని, పైగా సకాలంలో చికిత్స అందించకుండా ఫ్రీజర్ లో పెట్టడాన్ని దుర్మార్గపు చర్యగా పేర్కొంటూ పోలీసు కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.