ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అవమానం జరిగిందని, తన ఉద్యోగానికి రాజీనామా చేసిందట కడప జిల్లాలో ఒక మహిళ! ఎక్కడో తంతే.. మూతిపళ్లు రాలినట్టుగా.. చంద్రబాబు వ్యవహారానికీ, ఏ రాజీనామా తో నిరసన ఏంటబ్బా.. అనుకోవద్దు, సదరు మహిళ ఒక తెలుగుదేశం స్థానిక నేత కూతురట.
అసెంబ్లీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ విఫలయత్నాలన్నింటినీ కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో మెప్మాలో పని చేసే ఒక చిరుద్యోగి, అందులోనూ రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన ఒక టీడీపీ నేత కూతురు తన రాజీనామా అస్త్రాన్ని సంధించేసిందట. బహుశా చంద్రబాబుకు జరిగిన అవమానంపై రాష్ట్ర మహిళా లోకం ఆగ్రహం అని టీడీపీ చెప్పుకోవడానికి ఈ రాజీనామా పనికి రావొచ్చు కాబోలు.
పచ్చ బ్యాచ్ కు ఈ తరహా డ్రామాలూ కొత్తవి కావు. ఇలాంటివి చాలా చూశారు జనాలు. వెనుకటికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఓటు కు నోటు కేసులో చిక్కుకుని కరకట్టకు మకాం మార్చగానే.. ఏపీ వైపుకు అంటూ.. సైకిళ్ల మీద హైదరాబాద్ టు విజయవాడ వచ్చిన పుష్ఫవతి పుత్రిక ఒకరు ఇలాంటి రచ్చ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అనవిగాని రాజకీయం చేశారు. ఆ తర్వాత ఆమె చాన్నాళ్ల పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేసి, ఆ తర్వాత మతిస్థిమితం లేని చర్యలతో కూడా వార్తల్లోకి ఎక్కారు. మళ్లీ ఆమె ఏమైందో టీడీపీ కూడా పట్టించుకోలేదు! అలాంటివే చూశారు ఏపీ జనాలు, వాటి ముందు ఇలాంటివి చిన్నవే!
మొత్తానికి జరగని అవమానాన్ని, జరిగిందంటూ.. అందులోనూ.. తల్లీ,చెల్లి ప్రస్తావన తనే ముందుగా తీసుకు వచ్చి.. ఆ తర్వాత తనే ఏడ్చి రచ్చ రాజకీయం చేసిన చంద్రబాబు వ్యవహారం రక్తికట్టలేదని స్పష్టం అవుతోంది. ఈ డ్రామాకు అనుగుణంగా నందమూరి కుటుంబాన్ని తీసుకు వచ్చినా, మరోటి చేసినా.. అక్కడేం జరిగింది, గతంలో ఏం జరిగాయనే అంశాలే బాగా చర్చకు నోచుకుని.. టీడీపీ కోరిన సానుభూతిని అయితే జనింపజేయలేకపోయాయి! ఈ ఫెయిల్యూర్ ప్లాన్ ను ఈ అనామక రాజీనామాలు సూపర్ హిట్ చేస్తాయా?