రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతోంది. ఊహించని రికార్డులు సృష్టిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా.. ఇండియా అంతటా నెంబర్ వన్ ట్రెండింగ్ మూవీగా కొనసాగుతోంది. అయితే ఇందులో ఆశ్చర్యం లేదు. స్టార్ హీరో నటించిన ఏ సినిమా అయినా, ఏ ఓటీటీలోనైనా టాప్ ట్రెండింగ్ లో నిలుస్తుంది. అయితే జైలర్ సినిమా సంచలనం ఇక్కడితో ఆగలేదు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా ప్రతి భాషలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది జైలర్ మూవీ. అంతేకాకుండా.. హాంకాంగ్, మలేషియా, ఖతార్ లాంటి 29 దేశాల్లో కూడా జైలర్ సినిమా టాప్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. అంటే, ఆ దేశాల్లో కూడా జైలర్ సినిమాను నెటిజన్లు భారీ సంఖ్యలో చూస్తున్నారని అర్థం.
మరోవైపు థియేట్రికల్ గా ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ఒక్క తమిళనాడులోనే వంద కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమాగా రికార్డ్ సృష్టించింది జైలర్.
నెల్సన్ దర్శకత్వంలో వచ్చింది జైలర్ సినిమా. తమన్న, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఓవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, తమిళనాట ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.