మాజీ మంత్రి వివేకా చనిపోయినా, మళ్లీ ఆయన్ను నరుకుతున్నారు. చనిపోయి ఏ లోకాన ఉన్నారో తెలియదు కానీ, ఆయన్ను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తున్నారు. దీనికి “సాక్షి” మీడియా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక దురుద్దేశాలేంటో ప్రజానీకా నికి అర్థమవుతోంది. సాధారణంగా వైసీపీ వాళ్లపై ప్రతికూల ప్రెస్‌మీట్లకు, వార్తా కథనాలకు సాక్షి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని సంగతి తెలిసిందే.
అలాంటిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వివేకాను బద్నాం చేసే ప్రెస్‌మీట్‌కు సాక్షి పత్రిక కొండంత అండగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలే హత్యకు కారణమని భరత్ యాదవ్ అనే జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేయడం, దానికి సాక్షి అధిక ప్రాధాన్యం ఇవ్వడం…. అంతా ఫ్రీప్లాన్ అనే చర్చకు తెరలేచింది.
వివేకా హత్య కేసులో సీబీఐ నెలల తరబడి విచారించి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరిలను నిందితులుగా తేల్చేసింది. అలాగే దస్తగిరి నేర అంగీకారంలో తనకు ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టుగా వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి హత్యతో సంబంధం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
అయితే తనకు వివేకా హత్యతో సంబంధం లేదని దేవిరెడ్డి ఇటీవల సీబీఐ అధికారులకు లేఖ రాశాడు. పనిలో పనిగా వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే అనుమానాలను వ్యక్తం చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ పరంపరలో అదే ఆరోపణతో సీన్‌లోకి తరుణం అనే స్థానిక పత్రిక జర్నలిస్టు భరత్‌యాదవ్ వచ్చాడు.
పులివెందుల ఆర్అండ్‌బీ బంగ్లాలో భరత్ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశాడు. అలాగే తన వాదనను లేఖ రూపంలో సీబీఐకి రాసినట్టు అతను చెప్పుకొచ్చాడు. వివేకా హత్యలో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, ఎర్రగంగిరెడ్డి ప్రధాన సూత్రధారులని పేర్కొనడం కలకలం సృష్టిస్తోంది. అయితే వివేకా హత్యలో కుటుంబ సభ్యుల పోరులో భాగంగా పరస్పరం నేరారోపణలు చేసుకోవడాన్ని గమనించొచ్చు.
ఈ నేపథ్యంలో వివేకాకు వివాహేతర సంబంధాలుండేవని, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలే హత్యకు ఉసిగొల్పినట్టు చిత్రీకరించే ప్రయత్నాలను భరత్ యాదవ్ లేఖలో చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భరత్ వెనుక బలమైన అదృశ్య శక్తులేవో ఉంటూ నడిపిస్తున్నాయనే అనుమానాలు పులివెందులలో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా భరత్ రాసిన లేఖలో కీలక అంశాలను పరిశీలిద్దాం.
“ప్రతీసారి నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి పేర్లు వాడుతుండడంతో వివేకా హత్య వెనుక వీరున్నారని నాకు పూర్తిగా అర్ధమైంది. వివేకా హత్యకు ప్రధాన కారణం డబ్బులు, సెక్స్ అని కూడా సునీల్‌యాదవ్ చెప్పాడు. ప్రతి పనికీ మమ్మల్ని వాడుకుని డబ్బులు వచ్చిన తరువాత అందులో సగం పూర్తిగా తన సన్నిహితురాలైన షమీమ్‌కు ఇవ్వాలని వివేకా చెప్పేవారన్నాడు. వివేకా తన ఆస్తులను షమీమ్‌కు బదలాయిస్తున్నారనే విషయంపై నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వివేకా తరచూ గొడవ పడేవారని సునీల్‌యాదవ్ చెప్పేవాడు.
ఇలా వివేకా హత్యకు కుటుంబ, ఆస్తి తగాదాలు కారణమని.. ఈ విషయం ఎర్ర గంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జీర్ణించుకోలేక ఈ పనిచేసినట్లు సునీల్‌యాదవ్ చెప్పాడు. చివరికి.. నా డబ్బులు ఇవ్వకుండా నన్ను కూడా చంపుతామని చాలాసార్లు బెదిరించాడు” అని సీబీఐకి రాసిన లేఖలో భరత్ యాదవ్ రాసుకొచ్చాడు.
వివేకా హత్య కేసు నుంచి బయట పడేందుకు… మాజీ మంత్రికి సెక్స్ సంబంధాలు, ఆయన సన్నిహితురాలికి ఆస్తుల బదలా యింపు తదితర విషయాలను కూడా తెరపైకి కొత్తగా తేవడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. వివేకా వ్యక్తిగత విషయాలను , అది కూడా అనవసరంగా తెరపైకి తేవడం ఆయన్ను బద్నాం చేయడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికే హత్యతో సంబంధం ఉంటే… వివేకా కుమార్తె డాక్టర్ సునీత పట్టు విడవకుండా ఎందుకు పోరాటం చేస్తుందనే లాజిక్, ఇలాంటి అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్న, చేయిస్తున్న వారు ఎందుకు మరిచిపోతున్నారో అని పులివెందుల వాసులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో నిందితులెవరో తేలిపోయిందని, తాజాగా దాని వెనుక ఉన్న వారి మనస్తత్వాలు కూడా బయట పడుతున్నాయనే అభిప్రాయాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతుండడం చర్చకు దారి తీస్తోంది.