అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటే చేపట్టిన మహాపాదయాత్రకు ఏపీ బీజేపీ ఎట్టకేలకు మద్దతు ప్రకటించింది. అంతేకాదు, ఆ పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, రావెల కిశోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం ప్రకటించడంతో పాటు లక్షలాది రూపాయల విరాళం కూడా ఇచ్చారు.
అమరావతి రాజధానిగా కొనసాగాలని రెండేళ్ల కిందటే బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించిందని పురందేశ్వరి తెలిపారు. పాదయాత్రకు బీజేపీ మద్దతు ఇవ్వడంతో చాలామంది రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందన్నారు. అందరి ఆకాంక్ష అమరావతేనని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు.
అమరావతిపై సీఎం జగన్‌రెడ్డి కక్ష పెంచుకున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని అంగుళం కూడా కదలదని రాజ్యసభ సభ్యుడు సుజనచౌదరి మరోసారి స్పష్టం చేశారు. అమరావతే నవ్యాంధ్రకు ఏకైక రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. వీళ్లందరికీ రాజధానిపై ప్రేమా లేక అక్కడ కొనుగోలు చేసిన భూములపైనా అనేది చర్చనీయాంశం.
ఇదిలా ఉండగా కేవలం మద్దతు ఇస్తే… అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ మాటేంటని బీజేపీని విశ్వసించని వారి ప్రశ్న. మరోవైపు సీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కర్నూలు సమావేశంలో విడుదల చేసిన డిక్లరేషన్ మాటేంటని ఆ ప్రాంత ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
ఊరికో మాట చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టడం బీజేపీకి తెలిసినట్టుగా… మరే రాజకీయ పార్టీకి తెలియవని సీమ ఉద్యమకారులు మండిపడుతున్నారు. కేవలం పాదయాత్రలో పాల్గొంటే సరిపోదని, అమరావతిలోనే రాజధాని కొనసాగాలంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చివరికి రెంటికీ చెడ్డ రేవడిలా బీజేపీ పరిస్థితి తయారవుతుందనే ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో లేకపోలేదు.