చంద్రబాబుకు తీరని అవమానం జరిగింది అని తెలుగు తమ్ముళ్ళు అంతా కన్నీటి వరదలనే పారించారు. నిజానికి చంద్రబాబు కంట కన్నీటి చుక్క ఎరగకుండానే నాలుగు దశాబ్దాల రాజకీయాలను నెట్టుకొచ్చారు. అది ఆయన రాజకీయ చాతుర్యం కూడా కావచ్చు.
అయితే అంతటి చంద్రబాబు కూడా జగన్ సీఎం అయ్యాక మాత్రం ఎందుకో తట్టుకుని నిలబడలేకపోతున్నారు అన్న మాట కూడా ఉంది. బాబు వ్యూహాలూ నాడూ నేడూ కూడా పదునుతేరినవే. అయితే అవి జగన్ ముందు తుత్తునియలు అవుతున్నాయన్నదే ఒక విశ్లేషణ.
ఇదిలా ఉంటే టీడీపీ అధినాయకుడు చంద్రబాబుకు జీవితంలో చూడని అవమానం ఎదురైతే తమ్ముళ్ళు తగిన తీరున స్పందించారా అంటే జవాబు మౌనమే వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో చూసుకుంటే ఎంతో మంది మంత్రులుగా సీనియర్ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారిలో చాలామంది ఈ కీలకమైన సమయంలో మౌనంగా ఉండడం వెనక అర్ధమేంటి అన్న మాట కూడా వినిపిస్తోంది.
చంద్రబాబు విషయంలో ఏం జరిగింది అన్నది అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది. సరే ఆయనది ఎంతవరకు కరెక్ట్ అనుకున్నా బాబు మీడియా ఎదుటనే వెక్కి వెక్కి ఏడ్చారు. అందులో రెండో మాట లేదు కదా. మరి బాబు ఏడుపును చూసి అయినా నాలుగు ఓదార్పు మాటలు అనే పరిస్థితి కొందరు తమ్ముళ్లకు లేదా అని కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చాలా మంది నాయకులు టీడీపీ అధికారంలో ఉన్నపుడు హవా చలాయించారు. ఇపుడు వారు ఎందుకు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి చంద్రబాబు కళ్ళు కన్నీటి కాలువలుగా మారినా నో రియాక్షన్ అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.