ఆఫ్రికా దేశమైన మొరాకోలో మహావిషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో పెను భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య తొలుత 500గా భావించినప్పటికీ, తాజాగా ఆ సంఖ్య వెయ్యి దాటింది. క్షతగాత్రుల సంఖ్య కూడా వెయ్యి దాటింది. వీళ్లలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
హాలిడే స్పాట్ మర్రాకేస్ కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత 6.8గా నమోదైంది. భూమి నుంచి 18 కిలోమీటర్ల లోతున ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. ప్రకంపనల ధాటికి వందలాది భవనాలు నేలకూలాయి. వీటిలో వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి.
ఏం జరిగిందో తెలుసుకునేలోపే నగరం నాశనం అయింది. ఎటుచూసినా హాహాకారాలు, శిధిలాలు మాత్రమే మిగిలాయి. ఈ భూపంక తీవ్రత, పక్క దేశమైన అల్జీరియా వరకు కనిపించింది. అయితే ఆ దేశంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
అల్జీరియాలో 1980లో భారీ భూకంపం చోటుచేసుకుంది. 7.3 తీవ్రతతో కంపించిన భూమి, అప్పట్లో 2500 మందిని పొట్టనపెట్టుకుంది. ఇప్పుడు మొరాకాను కూడా వణికించింది.