బీజేపీకి టీడీపీ వ్యతిరేకమని కాంగ్రెస్ భావిస్తోందా? అందుకే జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో నిర్వహించే బహిరంగ సభకు టీడీపీకి ఆహ్వానం పంపిందా? బీజేపీపై వ్యతిరేకతను టీడీపీ వదిలేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు పార్టీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని వైసీపీని ఓడించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ బీజేపీ మాత్రం తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని, టీడీపీతో ఉండదని చెబుతోంది.
ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే నుంచి టీడీపీకి ఒక ఆహ్వానం అందింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు కాంగ్రెస్ ఈ ఆహ్వాన లేఖలు పంపింది. కాంగ్రెస్ ముఖ్య నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగింపు వేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని వ్యతిరేకిస్తూ..తమతో సఖ్యతగా ఉన్న 21 పార్టీలను ఆహ్వానిస్తూ లేఖలు రాసింది. అందులో టీడీపీకి కూడా లేఖ పంపింది.
మమతా బెనర్జీ, నితీశ్, స్టాలిన్, ఉద్దవ థాక్రే, అఖిలేష్ యాదవ్, మాయావతితో పాటుగా హేమంత్ సోరెన్..అదే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ. తమతో కలిసొచ్చే పార్టీలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పుకొచ్చింది. టీడీపీ తమతో కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎలా అనుకుందో అర్ధం కావడంలేదు. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా రాహుల్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పని చేసారు.
మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పలు పార్టీలతో సమావేశమయ్యారు. మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. కానీ, 2019 ఎన్నికల్లో ఇటు ఏపీలో చంద్రబాబు ఓడిపోవటం.. అటు కేంద్రంలో తిరిగి మోదీ అధికారంలోకి రావటంతో చంద్రబాబు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కాంగ్రెస్ తో నాడు చేతులు కలపటం చారిత్రక తప్పిదం గా పార్టీ సీనియర్లు పలు సందర్భాల్లో వాపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఏపీలో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
బీజేపీతో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఎవరితోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేస్తోంది. టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ చెబుతోంది కాబట్టి పచ్చ పార్టీ తనకు దగ్గర అవుతుందని కాంగ్రెస్ అనుకుంటున్నదేమో. అందుకే సభకు ఆహ్వానం పంపి ఉండొచ్చు. బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సహజంగానే ఈ సభకు వెళ్లడంలేదు.