టీడీపీకి వరుస షాక్‌లు. నారా లోకేశ్ కుప్పంలో యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టిన సమయం ఏంటో గానీ, అదే రోజు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం తారకరత్న మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ షాక్ నుంచి కోలుకోకనే మరో కీలక నాయకుడు గుండెపోటుకు గురి కావడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆదివారం తెల్లవారుజామున గుండె పోటుకు గురయ్యారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేసినట్టు సమాచారం. బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు, వైద్యులు చెబుతున్నారు. ఇదిలా వుండగా గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
దీంతో అక్కడ టీడీపీ బలహీనపడింది. టీడీపీకి పూర్వవైభవం తెచ్చే బాధ్యతల్ని బచ్చుల అర్జునుడికి అధిష్టానం అప్పగించింది. గన్నవరంలో ఆయన పార్టీ కార్యకలాపాలను అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారు. టీడీపీ వాయిస్‌ని వినిపించడంలో అర్జునుడు చురుగ్గా ఉంటారనే పేరుంది.
ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంపై టీడీపీ ఆందోళనగా ఉంది. కీలక సమయంలో టీడీపీ నేతలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతుండడంతో పార్టీ టెన్షన్‌కు లోనవుతోంది. బచ్చుల అర్జునుడు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.