ఆ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నా కన్ను!

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌న్ను ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. రానున్న ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచే బ‌రిలో నిల‌బ‌డాల‌ని ఆయ‌న గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. అయితే ఏ పార్టీ త‌ర‌పున అనేది…

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌న్ను ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డింది. రానున్న ఎన్నిక‌ల్లో అక్క‌డి నుంచే బ‌రిలో నిల‌బ‌డాల‌ని ఆయ‌న గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. అయితే ఏ పార్టీ త‌ర‌పున అనేది స‌స్పెన్స్‌లో ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న బీజేపీలో ఉన్నారు. ఏపీ బీజేపీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా కొంత కాలం సేవ‌లందించారు. ప్ర‌స్తుత ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో క‌న్నాకు అస‌లు పొస‌గ‌డం లేదు.

బీజేపీలో ఉక్క‌పోత ఫీలింగ్‌. క‌న్నా అనుచ‌రుల‌కు త‌గిన ప్రాధాన్యం లేదు. ఈ నేప‌థ్యంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు ఇటీవ‌ల క‌న్నా డుమ్మా కొట్టిన సంగ‌తి తెలిసిందే. సోము వీర్రాజుపై నేరుగా విమ‌ర్శ‌లు గుప్పించి, త‌న ఉద్దేశాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రోవైపు జ‌న‌సేన ముఖ్య నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ అక‌స్మాత్తుగా క‌న్నాను ఇటీవ‌ల క‌లిసి రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య భేటీ ర‌క‌ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది.

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అండ‌గా ఉంటాన‌ని క‌న్నా బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. దీంతో క‌న్నా జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ లోపు బీజేపీ జాతీయ నాయ‌కుడు క‌న్నాతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత క‌న్నా మీడియాతో మాట్లాడుతూ అబ్బ‌బ్బే…. నేను జ‌న‌సేన‌లో చేర‌లేద‌ని ముక్తాయింపు ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో క‌న్నా భవిష్య‌త్‌కు సంబంధించి ఓ కీల‌క విష‌యం బ‌య‌టికొచ్చింది. స‌త్తెన‌ప‌ల్లె నుంచి ఆయ‌న బ‌రిలో దిగుతార‌నేది ఖాయ‌మైంది. అయితే పొత్తుల‌ను బ‌ట్టి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌నేది తేలే అవ‌కాశం ఉంది. 

టీడీపీతో ఎట్టి ప‌రిస్థితుల్లో పొత్తు కుద‌ర‌ద‌ని బీజేపీ తేల్చేసింది. దీంతో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదిరితే… క‌న్నా ప‌వ‌న్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. లేదంటే టీడీపీ నుంచి ఆయ‌న పోటీ చేసేందుకు రెడీ చేసుకున్నారు. ఈ మేర‌కు టీడీపీ అధిష్టానంతో సంప్ర‌దింపులు కూడా జ‌రిగిన‌ట్టు తెలిసింది.