జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై ఆ పార్టీకి చెందిన నేతలే అసహనంగా ఉన్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ముఖ్యంగా జనసేనలో నంబర్-2గా నాదెండ్ల మనోహర్‌కు గుర్తింపు వుంది. పొత్తులకు సంబంధించి పవన్ వ్యవహార శైలిపై ఆయన తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. పొత్తులపై పూటకో మాట అన్నట్టుగా పవన్ వ్యవహరిస్తుండడం నాదెండ్ల అసలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది.
ఇలాగైతే తన దారి తాను చూసుకోవాల్సి వస్తుందని పార్టీ ముఖ్యుల ద్వారా పవన్‌కు సమాచారం చేరవేసినట్టు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడం కంటే, పొత్తులపైనే పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు నాదెండ్ల భావన. ఇదైనా నిర్మాణాత్మకంగా చేసుకుంటే కలిసొస్తుందని, కానీ పవన్ వైఖరి అందుకు భిన్నంగా వుందనేది నాదెండ్ల ఆరోపణ. చివరికి ఎవరూ నమ్మలేని పరిస్థితిని పవన్‌కల్యాణ్ చేజేతులా తెచ్చుకున్నారని జనసేనకు చెందిన ముఖ్య నాయకుల వద్ద నాదెండ్ల వాపోతున్నారని తెలిసింది.
పవన్ వైఖరితో విసిగిపోయిన బీజేపీ, టీడీపీ తమ పని తాము చేసుకుపోతున్నాయని ఆయన గుర్తు చెబుతున్నారని సమాచారం. పవన్ రాజకీయ అజ్ఞానానికి తన రాజకీయ జీవితాన్ని బలిపెట్టలేనని ఆయన అంటున్నారు. తెనాలి నుంచి ఆయన బరిలో నిలిచేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని, ఒంటరిగా పోటీ చేసి వీరమరణం చెందలేని చెబుతూనే, మరోవైపు మూడు ఆప్షన్లను తెరపైకి తేవడంపై నాదెండ్ల ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది.
ఇలా పదేపదే మాట మార్చడం వల్ల ప్రజలు, మిగిలిన పార్టీల నాయకులు నమ్మరని, ఎటూ చెల్లకుండా పోతామని నాదెండ్ల లబోదిబోమంటున్నారు. రాజకీయాల్లో తాను మరికొంత కాలం రాణించాలని అనుకుంటున్నానని, పవన్‌తో వుంటే ఏమవుతుందోననే బెంగ ఆయన్ను వెంటాడుతోంది.
పవన్ వైఖరితో విసిగిపోయిన నాదెండ్ల, మరికొంత కాలం వేచి చూసి, ఒక స్పష్టత వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకోవాలనే స్థిరమైన అభిప్రాయంతో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.