అజిత్ పవార్ రాజీనామా, ఫడ్నవీస్ కూడా?

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతూ ఉన్నాయి. బలపరీక్షకు ముందే భారతీయ జనతా పార్టీ కూటమి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్సీపీ లెజిస్లేటివ్ పక్ష నేతగా ఎన్నికైన అజిత్ పవార్ మద్దతు…

మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతూ ఉన్నాయి. బలపరీక్షకు ముందే భారతీయ జనతా పార్టీ కూటమి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్సీపీ లెజిస్లేటివ్ పక్ష నేతగా ఎన్నికైన అజిత్ పవార్ మద్దతు తమకు ఉందంటూ భుజాలెగరేసిన భారతీయ జనతా పార్టీ వాళ్లకు ఇప్పుడు అదే అజిత్ పవార్ ఝలక్ ఇచ్చాడు.

విశ్వాస పరీక్షకు ముందే ఆయన చేతులు ఎత్తేశాడు. బీజేపీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. అజిత్ పవార్ విషయంలో చాలా మంది వ్యక్తం చేసిన అనుమానాలే నిజం అయ్యాయి. ఆయనకు బలం లేదని, ఆలాంటి వ్యక్తిని చూసుకుని బీజేపీ మిడిసి పడిందనే అభిప్రాయాలకే విలువ దక్కింది.

శరద్ పవార్ కుటుంబ సభ్యులు అజిత్ పై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆయన రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందనే అభిప్రాయాలున్నాయి.

ఆ సంగతలా ఉంటే.. అజిత్ పవార్ రాజీనామా నేపథ్యంలో బీజేపీకి పూర్తిగా కథ అర్థం అయ్యిందని, మరి కాసేపట్లో ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విశ్వాస పరీక్షను ఎదుర్కొని సభలో భంగపడే బదులు ముందే రాజీనామా చేయడం మేలని ఫడ్నవీస్ అనుకుంటున్నారట. మొత్తానికి బీజేపీ ఇప్పుడప్పుడే తల ఎత్తుకోలేని అవమనాన్నే పొందినట్టుగా ఉంది ఈ వ్యవహరంలో!