అవిశ్వాస తీర్మానం లోపే ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసినా చేయవచ్చనే ఊహాగానాలకు ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఎన్సీపీ నుంచి అజిత్ పవర్ ఐదారు మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుపోలేకపోయారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అజిత్ పవార్ వెంట నడిచిన ఎమ్మెల్యేల సంఖ్య ఆయనతో సహా ముగ్గురు అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి!
కుక్క తోకను పట్టుకుని గోదావరిని ఈదే ప్రయత్నం చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్లు అజిత్ పవార్ ను నమ్ముకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ లెజిస్లేటివ్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అతడి మద్దతును సాంకేతికంగా ఉపయోగించుకోవచ్చని బీజేపీ ఆయనను నమ్ముకున్నట్టుంది, అయితే కోర్టు నిర్ణయంతో కథ అడ్డం తిరిగినట్టుగా ఉంది!
ఇప్పటికే అజిత్ పవార్ మళ్లీ ఎన్సీపీ తో చర్చలు మొదలుపెట్టారట. ఈ చర్చలు ఎన్సీపీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపుకు తీసుకెళ్లడానికి కాదు, తను ఎన్సీపీ వైపు కు దూకడానికట. అజిత్ పవార్ ను వెనక్కు రమ్మని శరద్ పవార్ పిలుపును ఇచ్చాడని, ఇప్పుడు కూడా క్షమించి పిలుచుకోవడానికి తాము సిద్ధమని ఆయన ప్రకటించారని ఎన్సీపీ వర్గాలు ప్రకటించాయి.
ఈ మేరకు అజిత్ పవార్ తర్జనభర్జనల్లో ఉన్నారని, ఆయన తిరిగి ఎన్సీపీతో కలవడం గురించి తర్జనభర్జనల్లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉంది. రేపటిలోగా అజిత్ పవార్ గనుక ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. అది భారతీయ జనతా పార్టీకి భారీ ఝలక్ కాగలదు. అజిత్ పవార్ ను నమ్ముకునే బీజేపీ ముందు అడుగు వేసింది, ఇప్పుడు అతడు వెనక్కు తగ్గితే కమలం పార్టీ పరువు మామూలుగా పోదంతే!