గ్రేటాంధ్ర కొన్ని వారాల కిందట అందించిన ఎక్స్క్లూజివ్ కథనమే నిజం కాబోతోందా? ప్రభుత్వంలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారాన్ని గ్రేటాంధ్ర పాఠకులకు అందించింది. ఆ సమాచారమే ప్రభుత్వం యొక్క అంతిమ నిర్ణయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రాజధాని అమరావతి నిర్మాణాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, సీఆర్డీయే అధికార్లకు చేస్తున్న సూచనలు అలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి.
అమరావతిలో రాజధాని ఉంటుందా లేదా అనే విషయంలో కొన్ని నెలలుగా అనేక పుకార్లు పుడుతున్నాయి. విపక్షాలు రాజకీయ రాద్ధాంతం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. రైతుల ఆవేదన అంటూ వారిని మరింత గందరగోళంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సీఆర్డీయేతో జగన్మోహనరెడ్డి నిర్వహించిన సమావేశంలో రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చేపడుతున్న పనులు అన్నింటినీ యథావిధిగా కొనసాగించాల్సిందిగా సూచించారు. నిధులను వెంటనే విడుదల చేస్తాం అని కూడా అన్నారు.
అయితే హెచ్ఓడీల ఆఫీసులు, సెక్రటేరియేట్, హైకోర్టు, అసెంబ్లీ వంటి వాటి విషయంలో మాత్రం.. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. గ్రేటాంధ్ర కొన్ని వారాల కిందట అందించిన కథనంలో కూడా ఇదే విషయాన్ని తెలియజెప్పింది. కోర్ కేపిటల్గా భావించే ఈ భవనాలను మంగళగిరి ప్రాంతానికి తరలించి.. దానిని న్యూ అమరావతి పేరుతో వ్యవహరిస్తారని.. గ్రేటాంధ్ర కథనంలో వివరించడం జరిగింది.
ఇప్పుడు జగన్మోహన రెడ్డి… సీఆర్డీయేతో సమీక్షించిన వ్యవహారాలను, చేసిన సూచనలను గమనిస్తోంటే.. అదే నిజం అనిపిస్తోంది. నిపుణుల కమిటీ సూచనల తర్వాత.. కోర్ కేపిటల్ ప్రతిపాదిత స్థలంలో కాకుండా కొద్దిగా పక్కకు జరిగే అవకాశం ఉంది. నాగార్జున యూనివర్సిటీ వెనుక ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు కావొచ్చు. అది న్యూ అమరావతి అవుతుంది. న్యూ అమరావతి అనే రాజధాని అచ్చంగా.. జగన్ మోహన్ రెడ్డి ముద్రతోనే ఉంటుందనేది నిస్సంశయం.