డిమాండ్ చేసే పరిస్థితి నుంచి బతిమాలే స్థితికి..!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం సమ్మె చేశారు. ఏకంగా 52 రోజుల పాటు ఉధృతంగా ధర్నాలు, సమ్మెలు చేశారు. విలీనం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలే ఉన్నాయా ఊడాయా అనే డోలాయమానంలో పడిపోయారు…

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం సమ్మె చేశారు. ఏకంగా 52 రోజుల పాటు ఉధృతంగా ధర్నాలు, సమ్మెలు చేశారు. విలీనం మాట అటుంచి ఉన్న ఉద్యోగాలే ఉన్నాయా ఊడాయా అనే డోలాయమానంలో పడిపోయారు ఆర్టీసీ కార్మికులు. డిమాండ్ చేసే పరిస్థితి నుంచి బతిమాలే స్థితికి వచ్చేశారు.

ఈరోజు ఉదయం 6 గంటల నుంచి డిపోల వద్దకు భారీగా చేరుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. తమను విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వీళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి ఆర్టీసీ డిపో వద్ద భారీగా పోలీసుల్ని మొహరించారు. అంతేకాదు, డిపోల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు.

లేబర్ కోర్టు నిర్ణయం తీసుకునే వరకు తామేం చేయలేమని స్పష్టంచేసింది ఆర్టీసీ యాజమాన్యం. ఈ మేరకు సమ్మెను విరమిస్తున్నట్టు కార్మికులు ఇచ్చిన లేఖను తిప్పిపంపించారు ఆర్టీసీ ఎండీ. ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే ఒప్పంద కార్మికులతో బస్సులు నడుపుతామని, లేబర్ కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేవరకు కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలోని అన్ని డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిపోల వద్దకు చేరుకుంటున్న అసలైన కార్మికులు, తాత్కాలిక కార్మికుల్ని అడ్డుకుంటున్నారు. దీంతో చాలా డిపోల వద్ద తోపులాట, ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్-1, నాగర్ కర్నూల్ డిపోల వద్ద పదుల సంఖ్యలో కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కొత్తగూడెం డిపో వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికుల్లో కొంతమందిని, స్వయంగా తాత్కాలిక కార్మికులు అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఒకదశలో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. కాస్త ఆలస్యంగా స్పందించిన పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.