అనుకున్నదే జరిగింది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టింది. బలపరీక్షను నిర్వహించి ప్రభుత్వ మనుగడను తేల్చాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బలపరీక్ష తేలాల్సింది రాజ్ భవన్ లో కాదు, అసెంబ్లీలో అని నిన్ననే సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు తుదితీర్పును వెల్లడించింది.
ఈ అంశంపై నిన్ననే వాదనలు పూర్తి అయ్యాయి. మంగళవారం పదిన్నర కు తీర్పును వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ప్రొటెం స్పీకర్ ను నియమించుకుని బలపరీక్షను నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు ముహూర్తాన్ని బుధవారంగా నిర్ణయించింది.
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు బలపరీక్ష పూర్తి కావాలని కోర్టు ప్రకటించింది. ఇది శరద్ పవార్ క్యాంపుకు ఊరటను ఇచ్చే అంశమే. వీలైనంత త్వరగా బలపరీక్ష జరగాలని కాంగ్రెస్-ఎన్సీపీ- సేనల పక్షం కోరుకుంది. ఆ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వైపు ఉన్నారని ఆ పక్షం అంటోంది. తమ బలం నూటా అరవై రెండు అని ప్రకటించుకుంది.
భారతీయ జనతా పార్టీకి సుప్రీం కోర్టులో గట్టి ఝలక్కే తగిలింది. రేపటి బలపరీక్షలో ఆ పార్టీ తమ వైపు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా నిరూపించుకోవాల్సి ఉంది. మహారాష్ట్ర రాజకీయం ఈ విధంగా మరో రసవత్తర ఘట్టంలోకి ప్రవేశించింది.