మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వ మనుగడకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బలపరీక్షను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశం ఓపెన్ ఓటింగ్.. బహుశా ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే బలపరీక్షను లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఇక్కడ కొన్ని అర్థం కాని అంశాలున్నాయి. అందులో ముఖ్యమైనది.. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతే వారు పూర్తిగా ఎమ్మెల్యేలు అయినట్టు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారు ఓటింగ్ కు అర్హులు అవుతారు. అప్పుడు బలపరీక్ష జరగాల్సి ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 మంది. వారంతా ఒకే రోజులో ప్రమాణ స్వీకారం పూర్తి చేస్తారా? చేయగలరా? అనేది కూడా ఒకింత సందేహమే. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరి చేతా ఒకే సారి ప్రమాణ స్వీకారం చేసే పద్ధతిని ఏమైనా అనుసరిస్తారా? ఒక్కో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయాలంటే.. కొంత సమయం పడుతుంది. దీంతో సాయంత్రానికళ్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యి, బలపరీక్ష జరగడం సాధ్యమేనా? అనేవి సందేహాలే.
ఐదు గంటలకు సుప్రీం కోర్టు డెడ్ లైన్ పెట్టింది. అలా కాకుండా.. ఐదు తర్వాత కూడా సభ జరిగితే.. రేపటితో ఫడ్నవీస్ ప్రభుత్వ పరిస్థితి తేలిపోవచ్చు. అలాగే ప్రొటెంస్పీకర్ ను నియమించాల్సి ఉంది. సభలో సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరు ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.