తన సాటి నటీనటుల ప్రేమ వ్యవహారాల గురించి సరదాగానే కాస్త ఆసక్తిదాయకమైన కామెంట్స్ చేసింది దీపికా పదుకునే. ఆ విషయంలో తనను కూడా కలుపుకునే ఆమె హాట్ కామెంట్స్ చేసింది. తమకు చాలా ప్రేమ వ్యవహారాలు ఉండటాన్ని దీపిక ప్రస్తావించింది. తామంతా 'విత్ ఔట్ ది షేమ్' అని ఆమె వ్యాఖ్యానించింది.
ఆ సమయంలో ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. ఆ ప్రోగ్రామ్ లో దీపిక, రణ్ వీర్, విజయ్ దేవరకొండ, అలియా భట్, ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ భాజ్ పాయ్ తదితరులు ఉన్నారు. ఒక అంశం మీద దీపిక స్పందిస్తూ.. తామంతా నిస్సిగ్గుగా పలు ప్రేమాయణాలను నడిపినట్టుగా వ్యాఖ్యానించింది.ఆ విషయంలో తనను తాను ఉదహరించుకుంది.
'నేను రణ్ బీర్ కపూర్ తో ప్రేమను సాగించాను. ఆ తర్వాత రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు రణ్ బీర్ కపూర్- అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు..' అంటూ దీపిక వ్యాఖ్యానించింది. అలా తన పాత ప్రియుడి గురించిన తన భర్త పక్కనే ఉండగా ప్రస్తావన తెచ్చింది దీపిక. ఇక్కడ కామెడీ ఏమిటంటే.. అలియా భట్ కూడా అక్కడే ఉండటమే కాదు, ఈ అంశం మీద స్పందించింది.
అది కూడా దీపిక వ్యాఖ్యలను ఒకింత ఖండిస్తూ..'రణ్ బీర్ –అలియాలు పెళ్లి చేసుకుంటున్నారు..' అంటూ దీపిక వ్యాఖ్యానించగా, 'అది నువ్వెలా డిక్లేర్డ్ చేస్తావ్..' అంటూ ప్రశ్నించేసింది అలియా. తను రణ్ బీర్ ను పెళ్లి చేసుకోవడాన్ని ధ్రువీకరించలేదు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా మాట్లాడిన దీపిక మాటలను ఆమె ఖండించింది! మొత్తానికి వ్యవహారాల గురించి సినిమా వాళ్లే ఓపెన్ గా చెప్పుకునే రోజులు వచ్చేసినట్టుగా ఉన్నాయి!