చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం వలన.. ఆ సన్నివేశాన్ని చూసిన చాలా మందికి బాధ కలుగుతుంది. అయ్యో ఇంత పెద్దాయన ఇవాళ ఇలా ఆపుకోలేక భోరుమన్నాడే అనే తక్షణ స్పందన తప్పకుండా ఉంటుంది. అయితే ఆ స్పందన, ఆ సానుభూతి ఎంతకాలం ఉంటుంది? ఇది పెద్ద ప్రశ్న. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు సానుభూతిని మళ్లీ ఓట్లపర్వం వచ్చేవరకు కాపాడుకోవాలని ఎవరైనా అనుకుంటారు. చంద్రబాబు కన్నీళ్లకు అంతబలం ఉందా? లేదని శనివారం నాడే తేలిపోయింది.
శుక్రవారం శాసనసభను తానే వెలివేసి బయటకు వచ్చిన తర్వాత.. నారా చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆరోజంతా తెలుగుదేశం నాయకులు ఆగ్రహోదగ్రులయ్యారు. సహజంగానే యెల్లో మీడియా ఉడికిపోయింది. ఆయన కన్నీళ్లను బీభత్సంగా మార్కెట్ చేయడానికి కూడా ప్రయత్నించింది. అవకాశం ఉన్న ప్రతిచోటా.. టీవీ ఛానెల్ మైకుల ముందుకు వచ్చిన తెలుగు మహిళలు- ఎవరికి తోచిన రీతిలో వారు రెచ్చిపోయి అధికార పార్టీ వారి మీద విరుచుకుపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు. ముందే చెప్పినట్లు తక్షణ స్పందన మాత్రమే.
కానీ ఈ సానుభూతిని సస్టయిన్ చేయడానికి తెలుగుదేశం ప్రయత్నించింది. శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలోనూ అధికార పార్టీ వారికి తమ నిరసనలు తెలియజేయాలని పిలుపు ఇచ్చింది. నిజమే ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి స్థాయి పెద్ద నాయకుడు- ఈ రకమైన అవమానం జరిగిందని దుఃఖపడినప్పుడు.. ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంఘీభావం తెలియజేయడం అవసరమే. కానీ అవి ఏమాత్రం జరిగాయో గమనిస్తే.. చంద్రబాబుకు ఏమాత్రం సానుభూతి లభించిందో ఇట్టే అర్థమైపోతుంది.
పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడైనా కొంత జనం పోగై తమ నిరసనలు తెలియజేసి ఉండొచ్చు గాక.. కానీ.. రాష్ట్రంలో దాదాపు రెండుదశాబ్దాల పైబడి అధికారం వెలగబెట్టిన పార్టీ- నిరసన తెలియజేయదలచుకుంటే అది ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో మాత్రం లేదు.
మండల కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో కనీసం పట్టుమని పది మంది కూడా లేకుండా.. తెలుగుదేశం జెండాలు పట్టుకుని కాసేపు రోడ్డు మీద నిల్చుని నినాదాలు చేసి.. ఆ ఫోటో దిగి మీడియాకు పంపేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మండల పార్టీ కమిటీ పేర్లు చూసినా.. చాలా పేర్లు కనిపిస్తాయి. కనీసం అంతమంది కూడా రాలేదేమో అనిపించేలా.. మండలాల లెవెల్లో తెలుగుదేశం నిరసనలు పేలవంగా జరిగాయి.
తనకు కష్టం వచ్చినప్పుడు ఏర్పడగల సానుభూతిని క్యాష్ చేసుకోవడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. అలిపిరి బాంబుదాడిని ఆ విధంగానే క్యాష్ చేసుకోవాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు కూడా కన్నీళ్ల విషయంలో ఆ పార్టీ అలాగే ఆలోచిస్తున్నదేమో గానీ.. శనివారం రాష్ట్రవ్యాప్త నిరసనల తర్వాత.. అర్థమవుతున్నదేంటంటే.. అసలు సానుభూతి అనేదే ఏర్పడలేదు.
రాజకీయ సభలంటే.. డబ్బులిచ్చి జనాల్ని తోలుకురావడం జరగొచ్చు. చంద్రబాబు తాను మహానాయకుడిని అనుకుంటున్నప్పుడు.. ఆయనకు జరిగిన అవమానానికి అభిమానులు స్వచ్ఛందంగా రోడ్లమీదికి వచ్చి నిరసన తెలియజేయాలి. కానీ అలా జరగలేదు. అందుకే పచ్చదళం కుమిలిపోతుంది.
తాము పిలుపు ఇవ్వగానే రాష్ట్రమంతా నిరసనలు వెల్లువ అవుతాయని పార్టీ అనుకున్నదేమో గానీ.. క్ష్క్షేత్రస్థాయిలో ఇంత పేలవమైన స్పందన ఉండేసరికి వారు ఖంగుతిన్నారు. సానుభూతి పుట్టించలేని కన్నీళ్లు ఎందుకు దండగ అని అనుకుంటున్నారు.