మొన్నటికిమొన్న గేదె పాలు ఇవ్వలేదని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని మించిన కేసు ఇది. బాయ్ ఫ్రెండ్ తనతో మాట్లాడ్డం లేదని, ఓ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కేసు ఫైల్ చేసింది. మధ్యప్రదేశ్ లో జరిగింది ఈ వింత ఘటన.
ఛింద్వారా ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి, బెతుల్ జిల్లా సర్నీకి చెందిన అబ్బాయి చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ప్రేమలో గిల్లికజ్జాలు సహజం. వీళ్ల లవ్ స్టోరీలో కూడా అలాంటి చిన్న గొడవ వచ్చింది.
రీసెంట్ గా అబ్బాయి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అమ్మాయి, తన ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. అంతే, కుర్రాడికి కోపమొచ్చింది. అమ్మాయి కాల్స్ కట్ చేశాడు. ఆమెతో మాట్లాడ్డం మానేశాడు.
చాలా రోజుల పాటు ప్రియుడితో టచ్ లోకి వెళ్దామని భావించిన అమ్మాయికి ఏం చేయాలో తోచలేదు. వెంటనే సర్నీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అబ్బాయిని పిలిపించారు. ఇద్దర్నీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పించారు. కౌన్సిలింగ్ తర్వాత ఇద్దరూ కలిశారు.
అయితే పోలీసులు అక్కడితో ఆగలేదు. అమ్మాయి-అబ్బాయి తల్లిదండ్రుల్ని కూడా పిలిచారు. వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే దగ్గర్లోని ఆర్యసమాజ్ మందిర్ లో ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకున్నారు.