ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే మంత్రివర్గంలో మార్పులు చేయాలి. పనితీరు బాగోలేకపోయినా మార్చాల్సిందే. మధ్య మధ్యలో జరిగే ఎన్నికల్లో పార్టీ పట్టు కోల్పోతుంటే కచ్చితంగా మంత్రివర్గంలో మార్పుచేర్పులు జరగాల్సిన అవసరం ఉంటుంది.
ఇలా చూసుకుంటే, ఏపీ సీఎం జగన్ కి మంత్రిమండలిని మార్చే అవసరమే లేదు కదా. ఏపీలో అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. ఎక్కడా ఎలాంటి అసంతృప్తి లేదు, అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ అంచనాలకు మించి ఫలితాలను సాధిస్తోంది. మరిప్పుడు జగన్ మంత్రి మండలిని మారుస్తారా..? అసలా అవసరం ఉందా..?
మంత్రిమండలి కూర్పు సమయంలోనే రెండేళ్ల కాలపరిమితి అని తేల్చేశారు జగన్. కచ్చితంగా మార్పులుంటాయని, ఆ మార్పులు కూడా పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఆ టైమ్ కూడా గడుస్తోంది. మరిప్పుడు జగన్ ఆలోచన ఏంటి..? ఆమధ్య మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, “నాతో సహా అందర్నీ మార్చేస్తున్నారంటూ” బాంబు పేల్చారు. ఆ తర్వాత ఆ హడావిడి తగ్గిపోయింది.
తాజాగా జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ విజయ దుందుభి మోగించింది. ఈ సంతోష సమయంలో తేనే తుట్టె కదిలించాల్సిన అవసరమేముందనేది అసలు ప్రశ్న.
మండలికి కూడా కేటాయింపులుంటాయా..?
గతంలో మండలి రద్దు చేస్తామని స్వయంగా చెప్పిన జగన్, మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో రాజీనామాలు చేయించి వారిని రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. మరిప్పుడు మండలిలో ఉన్న నేతలకు కూడా మంత్రివర్గ కూర్పులో భాగస్వామ్యం ఉంటుందా అనేది డౌట్.
ఆశావహుల కోసమైతే తప్పదు..
ఒకరిద్దరు సీనియర్లు సహా.. చాలా మంది ఫస్ట్ ఫేజ్ లోనే తమకి మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ అనూహ్యంగా రేస్ లో లేము అనుకున్నవారికి సైతం పదవులిచ్చి షాకిచ్చారు జగన్.
ఇప్పటికిప్పుడు మంత్రి వర్గాన్ని మార్చాలనుకుంటే మాత్రం అది కచ్చితంగా ఆశావహుల కోసమేనని చెప్పాలి. వారి కోసమైనా జగన్ తన టీమ్ లో మార్పులు చేర్పులు చేస్తారేమో చూడాలి. ఈ ఒక్క కోణం మినహాయిస్తే ఇప్పటికిప్పుడు జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిన అవసరమైతే లేదు.