ఒక భార్యను అన్నారని.. వందల మందిని నీచంగా..

తన భార్య గురించి అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబునాయుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అసలు తామెవ్వరూ ఆమె ప్రస్తావనే తేలేదని, సభలో అలా అన్నట్లుగా ఏమైనా ఆధారాలు చూపించాలని వైసీపీకి చెందిన వారంతా గగ్గోలుగా మొరపెట్టుకుంటున్నారు.…

తన భార్య గురించి అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబునాయుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అసలు తామెవ్వరూ ఆమె ప్రస్తావనే తేలేదని, సభలో అలా అన్నట్లుగా ఏమైనా ఆధారాలు చూపించాలని వైసీపీకి చెందిన వారంతా గగ్గోలుగా మొరపెట్టుకుంటున్నారు. నిజానిజాల సంగతి పక్కన పెడదాం. చంద్రబాబు మాటలు నిజమే అనుకుందాం. అయితే దానికి తెలుగుదేశం నుంచి స్పందన ఏమిటి? వారు ఎంత గౌరవంగా స్పందిస్తున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం నాయకుల దూకుడుతో హోరెత్తిపోతోంది. పచ్చిబూతులు, వినడానికి కూడా అసహ్యంగా అనిపించే భయంకరమైన బూతులతో వైసీపీ నాయకుల మీద విరుచుకుపడుతున్నారు. వైసీపీ నాయకుల కుటుంబసభ్యుల మీద అత్యంత నీచమైన మాటలతో చెలరేగుతున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల కుటుంబ సభ్యుల పేర్లతో అత్యంత హేయమైన వ్యాఖ్యలు జోడించి విషప్రచారం చేస్తున్నారు. 

నాయకుల భార్యలు, కూతుళ్ల సోషల్ మీడియా అకౌంట్లలోంచి వారి ఫోటోలను సేకరించి.. వాటికి భయంకరమైన వ్యాఖ్యలు జోడించి పెడుతున్నారు. వారు సరదాగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికలపై పెట్టుకుంటే. వాటిని కాపీ చేసి.. ఆ ఫోటోలను ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలను జోడిస్తూ.. నానా మాటలు అంటున్నారు.

ప్రధానంగా  కొందరు వైసీపీ నాయకుల మీదనే తెలుగుదేశం బూతుయోధుల ఫోకస్ ఉంటోంది. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లమీద తెలుగుదేశం బూతువీరుల విమర్శలు మితిమీరుతున్నాయి. ఎవడో ఒకడు వీరిని ఉద్దేశించి బూతు పంచాంగం విప్పుతాడు. నేరుగా బూతులు అనలేని యోధులందరూ కూడా.. ఆ పోస్టును షేర్ చేస్తూ శునకానందం పొందుతుంటారు. తెలుగుదేశం పార్టీ అభిమానులుగా చెలామణీలో ఉండే సోషల్ మీడియా వేదికలు, పేజీలు, గ్రూపులు చాలా వరకు ఇలాంటి బూతుల ప్రవాహంతో నిండిపోతున్నాయి. 

సాధారణంగా సోషల్ మీడియా అన్న తర్వాత.. ఎవరికి వారు చెలరేగిపోతూనే ఉంటారు. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు విచ్చలవిడిగా చేస్తూనే ఉంటారు. ఎక్కడా హద్దు అదుపూ ఉండదు. కానీ.. చంద్రబాబు నాయుడు కన్నీళ్ల నేపథ్యంలో అటువైపు నుంచి వివాదం కాస్త ముదరడంతో.. వైసీపీ నుంచి ఇలాంటి దూకుడు వ్యాఖ్యలు చేసేవారు కాస్త తగ్గారు. దాని ప్రభావంగా సోషల్ మీడియాలో వైసీపీ తరఫు బూతులు తక్కువగా తిరుగుతున్నాయి. సోషల్ మీడియా యావత్తూ.. తెలుగుదేశం ప్రచారంలో పెడుతున్న పచ్చిబూతులు మాత్రమే ప్రస్తుతం హోరెత్తిపోతున్నాయి.  

తన భార్యను అన్నారని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు సరే.. తన పార్టీ వాళ్లెవ్వరూ అదే తరహా తప్పులు చేయొద్దని ఒక్కమాట కూడా చెప్పలేకపోయారు ఎందుకు?