వ్యక్తి పూజ శృతి మించితే మామూలుగా వుండదు. సామాజిక బంధాలతో కొత్త పదబంధాలు సృష్టించి మరీ రాతలు రాయచ్చు. ఈవారం 'పలుకు' అలాగే వుంది. చంద్రబాబు అమిత మహాత్ముడు, అజాత శతృవు, అలాంటి వాడిని ఓడించి ఆంధ్ర ప్రజలు మహా పాపం చేసారు. అందుకే అనుభవిస్తున్నారు. పశ్చాత్తాపపడుతున్నారు. దుర్యోధన, దుశ్శాసన అంశంలో పుట్టిన వైఎస్ జగన్ ను నెత్తిన పెట్టుకున్నారు.
ఆయన నిండు సభను కౌరవ సభగా మార్చే సారు. వికటాట్టహాసాలు చేస్తున్నారు. పాపం కన్నీరు పెట్టడమే ఎరుగని బాబోరి చేత కన్నీరు పెట్టించారు. ఇంతకన్నా దారుణం మరోటి వుందా? ఇంతకన్నా ఘోరం మరొకటి వుంటుందా? ఇంతకన్నా పాపం వేరేదైనా జరుగుతుందా? ఇలా సాగిపోయాయి 'పలుకు'లన్నీ.
''..భార్యను చూసుకోని వాడు, కుటుంబాన్ని చూసుకోని వాడు దేశాన్ని ఏం ఉద్దరిస్తాడు..'' అని చంద్రబాబు నిండు సభలో ప్రధాని మోడీ మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేయొచ్చు. మోడీ భార్యను సరిగ్గా చూడడం లేదని సభలోకి లాగవచ్చు. అప్పుడు తెలుగుదేశం సభ్యుల పకపకా నవ్వ వచ్చు. తప్పు లేదు. ఎవరో సభ్యుడు ఏదో అంటే అది ముఖ్యమంత్రి జగన్ తప్పు. ఆ టైమ్ లో ఆయన అహంతో కూడిన నవ్వు నవ్వారు. అదీ అసలు సిసలు తప్పు.
ఓ మహిళ అనే కాదు, ఏ వ్యక్తి శీలహననమైనా తప్పే. ముమ్మాటికీ తప్పే. అది సభలో వున్నవారైనా, లేని వారైనా. కానీ ఈ శీలహనన పద ప్రయోగం వీళ్లందరికీ ఇప్పుడే కొత్తగా గుర్తుకు వచ్చిందా. దాదాపు దశాబ్ద కాలంగా వైఎస్ కుటుంబ సభ్యులందరి విషయంలో ఈ మీడియా చేస్తున్నది అదే కదా ? లక్ష కోట్లు తినేసారు. లక్ష కోట్లు తినేసాడు అంటూ ప్రచారం సాగించడం శీలహననం కాదా? హిందూ ధర్మాలను మనసా, వాచా పాటిస్తున్నా క్రిస్టియానిటీనీ ప్రోత్సహిస్తున్నాడు, మత మార్పిడులను పెంచుతున్నాడు అని పదే పదే రాయడం శీల హననం కాదా? అమ్మను, చెల్లిని బజార్న పడేసాడు, పదవులు ఇవ్వలేదు అని రాయడం శీలహననం కాదా? అదే వాళ్లకు పదవులు ఇచ్చి వుంటే కుటుంబ పాలన అని రాసేవారా కాదా?
అర్థరాత్రి ఆత్మలతో, దేవుడితో మాట్లాడతాడు, విదేశాల్లో మెంటల్ చికిత్స చేయించుకున్నాడు అని రాయడం శీల హననం కాదా? అంటే బాబోరికి అయితే ఒక నీతి, జగన్ కు అయితే మరో నీతి. ఓ ఎంపీ నిత్యం ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ ను, ఆయన కులాన్ని పదే పదే టార్గెట్ చేసి నానాయాగీ చేసినపుడు ఇది తప్పు అని ఒక్క 'పలుకు' కూడా పలకలేదేం?
సరే, ఈ పలకని పలుకుల సంగతి అలా వుంచి పలికిన పలుకుల సంగతి చూద్దాం.
''…పగ ప్రతీకారాలను ఇష్టపడే జగన్రెడ్డిలోని మరో కోణాన్ని కుప్పం గెలుపు ఆవిష్కరించింది…''
''బయట కనిపించిన ప్రతి స్ర్తీని చెరబట్టాలనుకునే వారు కూడా భువనేశ్వరిపై నిందలు వేయడమా?''
''..తల్లిని, చెల్లిని కూడా ఆదరించని జగన్ తాను శత్రువుగా భావించే చంద్రబాబును, ఆయన భార్యనూ గౌరవిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది…''
''చంద్రబాబును ఎన్నికల్లో ఓడించడం వల్ల జరిగిన, జరుగుతున్న అనర్థం ఏమిటో చాలామంది ఇప్పటికే గుర్తించారు…''
''..చంద్రబాబు కంట వెలువడిన కన్నీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల దుస్థితికి నిదర్శనంగానే చూడాలి…''
''..సంస్కారహీనులు రాజ్యమేలితే ఏం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ..''
''..జరిగిన దానికి బాధపడాల్సింది చంద్రబాబు కాదు, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణమైన ఒక రకం మనుషులు, ఏం జరుగుతున్నా నోరు విప్పని మేధావులు బాధపడాలి!..''
‘‘ఈసారి ఓటు వేసే ముందు వాడు మనిషికి పుట్టాడా లేదా కనుక్కుని ఓటువేయండి అని ఇప్పుడు చెబుతున్నాను’’
''..ఎవరైనా వారిని ఎన్నుకున్న ప్రజలదే తప్పవుతుంది…''
ఇలాంటి పలుకులు పలకడం ద్వారా ఏం చెప్ప దలుచుకున్నారు? ప్రజల్ని రెచ్చగొట్టే చర్యలో భాగం కాదా ఇవి. ప్రజలే తప్పు చేసారు. ప్రజలు మౌనంగా వున్నారు..ప్రజలు జగన్ ను గెలిపించినందుకే ఇదంతా జరుగుతోంది. ఇకపైన గెలిపించే ముందు మనిషికి పుట్టాడా లేదా కనుక్కోండి…
ఇవే కదా పలుకులు? అసలు అంత మహాత్ముడు, దైవాత్మ సంభూతుడు, గొప్పోరు అయిన చంద్రబాబును ఎందుకు ఓడించారు అని అడగొచ్చు కదా? అప్పుడు జనం చెబుతారు కదా? పసుపు కుంకుమ పేరిట అర్జెంట్ గా అప్పు చేసి మరీ పదేసి వేలు పందేరం చేసినా జనం ఎందుకు ఓడించారో?
పగ ప్రతీకారాలను జగన్ ఇష్టపడతాడు అని మీరు పలకడం శీల హననం కాదు. కనిపించే ప్రతి మహిళను చెరబట్టేవాళ్లు అసెంబ్లీలో వున్నారు అని మీరు చెప్పడం శీలహననం కాదు. తల్లిని చెల్లిని జగన్ ఆదరించడం లేదని చెప్పడం శీలహననం కాదు. జగన్ సంస్కార హీనుడు అనడం అస్సలు శీలహననం కాదు.
శీలం అంటే మహిళకే వుంటుంది. అందులోనూ నందమూరి ఆడపడుచుకే వుంటుంది. షర్మిలకు వుండదు, లక్ష్మీ పార్వతికి వుండదు. వైఎస్ జగన్ కు అస్సలే వుండదు. చంద్రబాబు లాంటి మహా మహితాత్ముడిని అకారణంగా ఓడించి ఆంధ్ర జనాలు అనుభవిస్తున్నారు. అర్జెంట్ గా జగన్ ను దించి చంద్రబాబును గద్దెనెక్కించాలి. అంతే కదా మీరు చెప్పదలుచుకుంది.
''…చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయన జీవితాశయం ఏమీ నెరవేరదు. వయసు రీత్యా మరో పర్యాయం మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయగలరు. ఇంతోటి దానికి అవమానాలు భరించాల్సిన అవసరం ఆయనకు లేదు…''
మరి ఎందుకు ఇంత బాధ? ప్రజల కోసమా? తన కొడుకు లోకేష్ కు వారసత్వ పగ్గాలు అప్పగించి ముఖ్యమంత్రిని చేయడం కోసమా? ఆ మాట దాస్తారేమీ? లోకేష్ ను ఎప్పటకీ ముఖ్యమంత్రిని చేయను అని చంద్రబాబు చెప్పగలరా? చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన జీవితాశయం నెరవేరదంటారేంటీ? కొడుకును సిఎమ్ ను చేయడం ఆయన జీవితాశయం కాకుండా, అడ్డదారిన మంత్రిని ఎందుకు చేసినట్లు?
రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అన్నట్లు, ఈ ప్రతి పలుకు పలుకు మధ్య కనిపంచని పలుకులు ఎన్నో వున్నాయి. మనం మనకు మాత్రమే ఆ పలుకులు తెలుసు అనుకుంటాం. కానీ జనాలు తెలివి మీరారు. వాళ్లకూ ఈ పలుకుల అంతరార్ధాలు అన్నీ తెలుసు. ఎటొచ్చీ వారికి తెలియదు. వాళ్లను అమాయకులను చేసి ఇంకా నమ్మబలకొచ్చు అనే భ్రమలో బతుకుతున్నాం.