తాటిచెట్టు కింద పాలు తాగినా…

తాటిచెట్టు కింద పాలు తాగినా.. కల్లే అంటారు.. అని తెలుగు సామెత. ఈ సామెత భావమేమిటో… పాపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు తెలియనట్లుగా ఉంది. అందుకే.. ఆయన పార్లమెంటుప్రాంగణంలోని భాజపా…

తాటిచెట్టు కింద పాలు తాగినా.. కల్లే అంటారు.. అని తెలుగు సామెత. ఈ సామెత భావమేమిటో… పాపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు తెలియనట్లుగా ఉంది. అందుకే.. ఆయన పార్లమెంటుప్రాంగణంలోని భాజపా కార్యాలయానికి వెళ్లి.. చిన్నపాటి చర్చకు కారణం అయ్యారు. అసలే పూర్వాశ్రమంలో భాజపా అనుబంధం కలిగి ఉన్న ఈ నాయకుడు, తాజాగా మళ్లీ భాజపా కార్యాలయంలో కనిపించే సరికి సహజంగానే.. రకరకాల పుకార్లు హఠాత్తుగా పుట్టుకొచ్చాయి.

రఘురామకృష్ణం రాజు ఇదివరలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవలి పరిణామాల్లో ఆయన పార్లమెంటులో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు.

అసలే రాష్ట్రంలో తెలుగుభాషను జగన్ తొక్కేస్తున్నాడని, ఇంగ్లిషు మీడియం ద్వారా నష్టం చేస్తున్నాడని విపక్షాల విమర్శలు పెచ్చుమీరుతున్న తరుణంలో, సొంత పార్టీ ఎంపీ తెలుగు గురించి మాట్లాడడం జగన్‌ను ఇరుకున పెట్టింది. ఎంపీ వైఖరిపై జగన్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అందుకు ఎంపీ తాను జగన్ చర్యలను సమర్థించానంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

అదే సమయంలో భాజపాలో చేరిన కొత్త నాయకుడు సుజనాచౌదరి… వైకాపా ఎంపీలు కూడా కొందరు తమతో టచ్‌లోనే ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. అసలే తమ పార్టీని బలపరుచుకోవడం లక్ష్యంగా… దేశవ్యాప్తంగా.. భాజపా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న సీజన్ ఇది.

ఇలాంటి సమయంలో.. వైకాపా ఎంపీలకు కూడా గేలం వేస్తున్నదా? అనే చర్చ సహజంగానే రాజకీయ వర్గాల్లో వచ్చింది. ఇలా పుకార్లు హాట్ హాట్ గా ఉండగా.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు… భాజపా ఆఫీసులో దర్శనమిస్తే.. పుకార్లు రేగకుండా ఎలా ఉంటుంది.

అందుకే ఆయన భాజపాలోకి ఫిరాయిస్తున్నారేమో అనే అనుమానం పుట్టేలా పుకార్లు షురూ అయ్యాయి. అయితే.. తాను ఎంపీగా ఢిల్లీలో క్వార్టర్స్ కేటాయింపుకోసమే భాజపా ఆఫీసుకు వెళ్లానంటూ ఎంపీ వివరణ ఇచ్చుకున్నారు.

అవసరం అనిపిస్తే.. మోడీ, అమిత్ షా ల అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లగలనని ఇలా పార్లమెంటులో ఎందుకు కలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. కానీ సారూ.. సామెత చెప్పినట్టు భాజపా ఆఫీసుకు ఇల్లుకోసం వెళ్లినా.. ఫిరాయింపు కోసమే అని ప్రజలు అనుకుంటారు.