పత్రికలు ఎప్పుడూ సమాచారాన్ని ప్రజలకు అందజేయడంలో నిర్దిష్టమైన పాత్రను పోషిస్తాయి. నాయకులు, బాధ్యతగల ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలను.. ప్రజలకు, సమాజానికి అందజేయడంలో వాహకాలుగా ప్రవర్తిస్తాయి. ఈ క్రమంలో అలాంటి నాయకుల మాటలు కొన్ని, ఇతరులకు ఇబ్బందికరంగా ఉండవచ్చు.
అంత మాత్రాన వారు పత్రికలను నిందిస్తే ఏం లాభం ఉంటుంది. డ్రింక్ బాగా లేకపోతే.. మనం సీసాను నిందిస్తే లాభం ఉంటుందా? ఈ సత్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుసుకోవాలి.
ఆయన ఇటీవలి పరిణామాలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ రెండు పత్రికలు వైఎస్సార్ కాంగ్రెస్ కు నష్టం జరిగే విధంగా వార్తలను మలిచి రాస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానం ఉండకపోవచ్చు అలాంటి అనేకానేక వార్తలు ప్రతి నిత్యం ఆ పత్రికల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ.. వారి నిమిత్తం లేని విషయంలో వారిపై విమర్శలు చేస్తున్నారు విజయసాయి.
ఈనెల 17న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశం గురించిన వార్తలో తనకు అవమానం కలిగేలా వక్రీకరించి ప్రచురించారనేది విజయసాయి ఫిర్యాదు. సహ సభ్యులు తనకు క్లాస్ తీసుకున్నారంటూ… తన మర్యాదకు భంగం కలిగేలా రాశారని ఆయన పేర్కొన్నారు.
స్పీకరు ఓంబిర్లాకు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అలా రాసిన విలేకర్ల పార్లమెంటు పాస్ లను రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. పత్రికలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా, ప్రతికూలంగా తీసుకునే విధాన నిర్ణయాల్లో విలేకర్లు చాలా చిన్న ‘టూల్స్’ కింద లెక్క.. వారికి శిక్ష వేయాలనడం.. ఇంకా చిత్రమైన కోరిక.
అయితే తాము ప్రచురించింది తెలుగుదేశం ఎంపీ కనకమేడల వ్యాఖ్యలను అని.. ఆయన మాటలను అలాగే ఇచ్చాం అని ఈనాడు వివరణ కూడా ఇచ్చుకుంది. అదే నిజమైతే.. పత్రిక తప్పు చేసినట్టు కాదు.
విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే.. తెదేపా ఎంపీ కనకమేడల తన మర్యాదకు భంగం కలిగేలా మాట్లాడాడంటూ స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు. కోర్టులో కూడా పరువునష్టం దావా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కోపం వస్తే.. ఆ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయమని కూడా అడగొచ్చు.
అంతే తప్ప.. విలేకర్ల పాస్ లు రద్దు చేయాలనే చిత్రమైన కోరిక నిజంగానే ఆయన మర్యాదకు, స్థాయికి భంగం కలిగిస్తుంది.