రైతు భరోసా.. జగన్ ప్రకటించిన నవరత్నాల్లో అత్యంత ప్రాధాన్యమైన కార్యక్రమం ఇది. ఈ పథకం కింద కౌలు రైతులకు కూడా లబ్ది చేయబోతున్నారు ముఖ్యమంత్రి. కేబినెట్ లో దీనిపై నిర్ణయం తీసుకొని, అధికారికంగా ప్రకటించారు కూడా. ఇప్పుడు దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు.
అవును.. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తూ జీవో విడుదలైంది. అంతేకాదు.. గతంలో ప్రకటించని కొన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు, లాభాల్ని కూడా జీవోలో పొందుపరచడం విశేషం. తాజా జీవోలో హైలైట్ పాయింట్ ఏంటంటే.. ఎవరైనా కౌలు రైతు సంతానం ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నప్పటికీ రైతు భరోసా వర్తిస్తుంది.
అంటే.. సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నప్పటికీ, సదరు రైతును మాత్రం కౌలు రైతుగానే గుర్తిస్తారన్నమాట. అంతే కాకుండా.. కౌలు రైతు మరణిస్తే, అతడి భార్యకు రైతు భరోసాను వర్తింపజేయబోతున్నారు.
కౌలు రైతులతో పాటు ఏజెన్సీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు, ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా వ్యవహరిస్తున్నవారికి ఈ పథకం వర్తించదు. వీళ్లతో పాటు మాజీ ప్రజాప్రతినిధులకు కూడా రైతు భరోసా పథకం వర్తించదు.