చంద్రబాబు రాయలసీమ టూర్ పూర్తవుతూనే.. ఆయన దత్తపుత్రుడు అదే సీమలో అడుగు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 1 నుంచి పవన్ 6 రోజుల పాటు రాయలసీమలో పర్యటిస్తారు. ఇటు చంద్రబాబు పర్యటన తర్వాతే పవవ్ రాయలసీమ టూర్ పెట్టుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాబు ఆదేశాలతోనే పవన్ ఈ టూర్ కు రెడీ అయినట్టు కనిపిస్తోంది.
రైతాంగం, మేధావులతో చర్చలు. వైసీపీ అక్రమ కేసులకి వ్యతిరేకంగా పోరాడేలా తమ పార్టీ నాయకుల్లో ధైర్యం నింపడం. ప్రధానంగా ఇదీ పవన్ టూర్ షెడ్యూల్. ఈమేరకు జనసేన సోషల్ మీడియా వింగ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
అయితే కేవలం అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టేందుకే పవన్ సీమలో అడుగు పెట్టబోతున్నారని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి.ఇప్పటికే జగన్ పాలనపై టీడీపీతో కలిసి విషం చిమ్ముతున్న పవన్, రాయలసీమలో కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చేసే అవకాశం ఉంది. అయితే పవన్ కల్యాణ్ కి సీమవాసులు చుక్కలు చూపిస్తారంటూ మరో వర్గం సవాళ్లు విసురుతోంది.
హైకోర్టు పులివెందులలో పెట్టుకో అంటూ జగన్ పై సెటైర్లు వేసి, సీమను తక్కువ చేసి మాట్లాడిన పవన్ ఏ మొహం పెట్టుకుని రాయలసీమలో అడుగుపెడతారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇక పవన్ రాయలసీమలో ఉన్నన్ని రోజులు ఆయనకి చుక్కలేనంటున్నారు కొంతమంది రాయలసీమ నేతలు. వాస్తవానికి రాయలసీమలో జనసేనకు పెద్దగా బలం లేదు. కేవలం సినీ హీరోగా పవన్ ని అభిమానించే యువతే ఆయనకు గతంలో బ్రహ్మరథం పట్టింది.
తాజాగా ఇంగ్లిష్ మీడియంపై పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు ఓ వర్గం దూరమైంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు వంతపాడే విధంగా పవన్ ప్రవర్తిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ రాయలసీమ టూర్ పెట్టుకున్నారు. పవన్ వస్తే సైలెంట్ గా ఉండరు, సైలెంట్ గా ఉన్నా కూడా రాయలసీమ వాసులు తమపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలంటారు. మొత్తమ్మీద పవన్ ఆరు రోజుల సీమ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.