స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 గా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయడు అరెస్ట్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితమే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని.. సుదీర్ఘ విచారణ అనంతరం.. బలమైన సాక్ష్యాలతోనే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. బాబు సీఎంగా ఉన్నప్పుడు బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలగా దోచుకున్నారని.. 2017-18లోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం.. రూ.241 కోట్లు డైవర్ట్ అయ్యిందని బయటపెట్టిందన్నారు. ఎఫ్ఐఆర్ కంటే ముందే జీఎస్టీ నిఘాలో స్కామ్ బయటపడిందని.. స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఉందనే బలమైన సాక్ష్యాలు సీఐడీ దగ్గర ఉన్నాయన్నారు.
నోటీసులు ఇవ్వలేదని టీడీపీ అవాస్తవాలు చెబుతోందని.. అరెస్ట్ గురించి చంద్రబాబుకు ముందే తెలిసే మూడు రోజుల క్రితం నుండి తన అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. అరెస్ట్‌పై ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. ఎంత కాలం తప్పించుకుంటావు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అవినీతి జరగలేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు. మరోవైపు చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ నోటీసుల సమాచారం తెలుసుకుని ఇద్దరు నిందితులు విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది.