తాము తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి ప్రస్తావన తీసుకురాలేదని, ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా ఏ మాటా మాట్లాడలేదని.. బాబాయ్-గొడ్డలి అంటూ చంద్రబాబు నాయుడు అంటే, మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్యల గురించి మాట్లాడామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తుకుంటున్నారు.
అసలు మాధవరెడ్డి హత్య అనగానే.. అదెలా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని శంకించడం అవుతుందనేది సగటు మానవుడి సందేహం కూడా! అయితే.. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్న టీడీపీ ఒకలా రెచ్చిపోతుంటే, పచ్చమీడియా ఇంకో రూట్లో వెళ్తోంది!
ఒక పచ్చ చానళ్లో అయితే… చంద్రబాబు నాయుడు, ఆయన భార్యభువనేశ్వరికి ఎప్పుడు పెళ్లైంది, లోకేష్ ఎప్పుడు పుట్టాడు? మాధవరెడ్డి టీడీపీలోకి ఎప్పుడు చేరాడు, మాధవరెడ్డి 1981 నాటికి ఏం చేస్తున్నాడు. ఏ ఊర్లూ ఉన్నాడు.. వంటి వివరాలను ప్రేక్షకులకు విలువైన సమాచారం రీతిన అందిస్తూ ఉంది!
తాము భువనేశ్వరిని ఏమనలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాపోతోంది. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నారని, ఏడుపుగొట్టు రాజకీయంతో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విషయంలో ఆఖరికి భార్య శీలాన్ని చర్చగా పెట్టడానికి వెనుకాడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది.
ఇలాంటి సమయంలో… చంద్రబాబు అనుకూల మీడియా, ఈ పెళ్లి డేట్లు, పురుటి డేట్లనూ చెబుతూ.. ఈ వ్యవహారాన్ని అగ్లీగా మార్చడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం గమనార్హం!