మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై మంత్రి పేర్ని నాని అన్‌స్టాపబుల్ వాయింపునకు దిగారు. తన భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో వెక్కివెక్కి ఏడ్వడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఇదే సందర్భంలో తమ అధినాయకుడిని ఏడ్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
సోదరి భువనేశ్వరికి సంఘీభావంగా నందమూరి కుటుంబం ఇవాళ బాలకృష్ణ ఇంట్లో సమావేశమైంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే మాత్రం… తమలోని మరో రూపాన్ని చూడాల్సి వస్తుందని నందమూరి బాలకృష్ణతో సహా ఇతర కుటుంబ సభ్యులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీకి మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో దీటైన సమాధానం ఇచ్చారు.
బాలకృష్ణ అమాయక చక్రవర్తి అన్నారు. కానీ చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారని నాని చెప్పుకొచ్చారు. అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారన్నారు. అలాంటిది తాము ఎందుకు తిడతామని నాని ప్రశ్నించారు. అనవసర మాటలతో రాద్ధాంతం చేసింది చంద్రబాబే అని మండిపడ్డారు. చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారన్నారు. ఇది దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని మరోసారి పేర్ని నాని స్పష్టం చేశారు.
ఇవాళ బాలకృష్ణ, మిగిలిన తోబుట్టువులంతా తమ సోదరిని వైసీపీ ఎమ్మెల్యేలు ఏదో అన్నారని నమ్మి మాట్లాడ్డం బాధాకర విషయమన్నారు. సాక్ష్యాత్తు తమకు జన్మనిచ్చిన,పెంచి పోషించిన తండ్రి గురించే వారి బుర్రల్లో విషం ఎక్కించగలిగిన నేర్పరితనం ఉన్న చంద్రబాబు… అనకుండానే వారి సోదరి గురించి, తోబుట్టువు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నమ్మించడం చాలా చిన్న విషయంగా చెప్పుకోవచ్చన్నారు.
సాక్ష్యాత్తు ఎన్టీఆరే దుర్మార్గుడు, దుష్టుడు అని నమ్మించగలిగిన నేర్పరితనం చంద్రబాబులో ఉందన్నారు. ఇవాళ ఇద్దరు సామాన్య ఎమ్మెల్యేలు ఏదో అన్నారని సృష్టించడం ఆయనకి చాలా చిన్న విషయమని మనకు అర్థమవుతుందన్నారు.
చరిత్ర ఒకసారి చూసుకుంటే రామారావు కడుపున పుట్టిన కూతుళ్లు, కొడుకులు కన్న తండ్రిని కూడా వదిలేసి, ఆయన్ను పడేయడానికి సహకరించారంటే …ఎంతగా తండ్రి మీద విషపు మాటలు నమ్మించి వుంటారు? లేక పోతే ఏ తండ్రినైనా పడేయడానికి, ఏ తండ్రినైనా అవమానించడానికి, ఏ తండ్రినైనా మానసికంగా కుంగదీయడానికి ఏ పిల్లలు ఒప్పుకుంటారని పేర్ని నాని నిలదీశారు.
అందులో క్షణక్షణం తాము రామారావు గారి పిల్లలమని, తమలో ప్రవహించేది ఎన్టీఆర్ రక్తమని గర్వంగా చెప్పుకునే పిల్లల్లో కూడా ఆ రోజు రామారావుకు వ్యతిరేకంగా, వారి మనసుల్లో, వారి బుర్రలో విషం ఎక్కించగలిగేంత నేర్పరితనం ఉంది కాబట్టి ఇవాళ అనని మాటల్ని కూడా, వారి శ్రీమతిని ఎక్కడా అనకపోయినా, వారి పేరు తీయకపోయినా ఈ రకంగా ఆపాదించి, దుర్మార్గమైన రాజకీయ ప్రక్రియకి, క్రీడకి తెరలేపారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప. దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెచ్చారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు.. ఏమన్నారో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు మాటలను వీడియో చేశారు కదా. అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా అని నిలదీశారు. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరమన్నారు.
రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబే అని విరుచుకుపడ్డారు. తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నాం… చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని పేర్ని నాని తెలిపారు.