కొత్త పదవి అక్కరలేదు… పాత పదవి చాలు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెక్కివెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన భార్య భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారని భోరున విలపించారు. తాము ఆయన భార్య ప్రస్తావనే తీసుకురాలేదు.  Advertisement…

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెక్కివెక్కి ఏడ్చారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన భార్య భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారని భోరున విలపించారు. తాము ఆయన భార్య ప్రస్తావనే తీసుకురాలేదు. 

కావాలంటే రికార్డులు చూసుకోండి అని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు. చంద్రబాబువి డ్రామాలన్నారు. వాళ్ళు అన్నందుకు బాబు విలపించారో, డ్రామానో తెలియదు. రాజకీయ నాయకులది నిజమో, నటనో కనిపెట్టలేం. 

సరే … దాన్నలా పక్కన పెడితే చంద్రబాబు భీకర ప్రతిజ్ఞ చేయడం విశేషం. తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని అన్నాడు. ఒకప్పుడు ఎన్టీఆర్  ఇలాగే ప్రతిజ్ఞ చేసి సీఎంగానే సభలో అడుగు పెట్టారు.తమిళనాడులో జయలలిత కూడా ఇలాంటి ప్రతిజ్ఞ చేసి సీఎంగానే అసెంబ్లీకి వచ్చారు. 

చంద్రబాబు అలా వస్తారో రారో తెలియదుగాని భీకర ప్రతిజ్ఞ మాత్రం చేశారు. హైదరాబాదుకు కూడా వెళ్ళిపోయాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం వస్తుందనే నమ్మకం బాబుకు బలంగా ఉన్నట్లుంది.

బాబు ప్రెస్ మీట్లో కాళ్ళమీద పడేంతవరకు కడుపు చించుకున్నాడు. అంటే తన బాధ మొత్తం వెళ్లగక్కాడు. ఆ బాధలోనే బాబు ఒక విషయం చెప్పాడు. నాకు కొత్తగా రావాల్సిన పదవులు లేవు. నెలకొల్పాల్సిన రికార్డులు లేవు. ముఖ్యమంత్రిగా నా రికార్డును అందుకోవాలంటే ఎవరికైనా చాలాకాలం పడుతుంది అన్నాడు. ఇంకా చాలా చెప్పాడనుకోండి. అదంతా మనం చెప్పుకోవాలంటే చాంతాడంత అవుతుంది. వదిలేద్దాం.

నాకు కొత్తగా రావలసిన పదవులు లేవని బాబు అన్నాడంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మీదనే మోజు ఉందని అర్ధం. ఆయనేమీ పదవీ త్యాగం చేయడం లేదు. రాజకీయ సన్యాసం తీసుకోవడంలేదు. ఆయనకు కొత్త పదవి అక్కరలేదు. పాత పదవే కావాలి. అందుకే సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్నాడు.