చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి గాంధీ కాలం కాదు. మంచి తనం కన్నా మాస్ నాయకుడికే జనం జేజేలు పలికే రోజలు ఇవి.
కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ల విడియోలు యూ ట్యూబ్ లో వైరల్ అయిపోతుందే, ఆ మాటలు, ఆ బూతులే సూపర్ అని జనాలు జేజేలు పలుకుతుంటే, నందమూరి ఫ్యామిలీ ఇంకా ఎక్కడో బిసి కాలంనాడు వుండిపోయినట్లుంది.
నందమూరి బాలయ్య ప్రెస్ మీట్ అంటే జనం ఉలిక్కి పడ్డారు. ఎక్కడ ఉగ్రరూపం దాల్చుతారో అనుకున్నారు. కనీసం లేస్తే మనిషిని కాను అని అన్నా అంటారేమో అనుకున్నారు.
కానీ మందు సరిగ్గా దట్టించని సిసింద్రీ మాదిరి చీదేసింది వ్యవహారం. మాట్లాడిందే మాట్లాడుతూ, ఏదోదో మాట్లాడేసి, అయిందనిపించారు. మిగిలిన వారు కాస్త నోరు చేసుకున్నా జనానికి పట్టదు.
ఇక కళ్యాణ్ రామ్ కూడా ఓ ప్రకటన విడుదల చేసారు. అదీ అలాగే వుంది. రోడ్డుకు ఎడమవైపే నడవవలెను. జీబ్రా లైన్ మీదే క్రాస్ చేయవలెను ఇలాంటి సుద్దులు చెప్పినట్లు వుంది ఆ ప్రెస్ నోట్.
రసికుడు కాని వాడికి కవిత్వం ఎలా రుచించదో, బూతులు నోట పెట్టుకుని తిరిగేవారికి ఇలాంటి మాటలు అస్సలు రుచించవు
పైగా పార్టీ అభిమానులు, నేతలు ఇవన్నీ చేతకాని మాటలు అనుకునే ప్రమాదం వుంది. అర్జెంట్ గా చొక్కా చేతులు పైకి మడిచి ఎవరి మీదకూ దాడికి వెళ్లనక్కరలేదు. కానీ దాడి చేయగలమని భయపెట్టగలగాలి.
తేడా వస్తే తాట తీస్తామనే భావన కలిగించాలి. అప్పుడే కార్యకర్తలు, నాయకులు వీళ్లలో లీడర్ షిప్ క్వాలిటీని గుర్తిస్తారు. లేదూ అంటే ప్రత్యర్ధులు మరింత రెచ్చిపోతారు.