బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇప్పటికే ఎన్సీబీ తనపై మోసిన అభియోగాలపై అరెస్టై, బెయిల్ పై విడుదల అయిన ఆర్యన్ కు కోర్టు మరో సానుకూలత వ్యక్తం అయ్యింది.
ఆర్యన్ ఖాన్ రెగ్యులర్ గా డ్రగ్స్ వాడాడు అని ఎన్సీబీ తన అభియోగాల్లో ప్రధానంగా పేర్కొంది. అందుకు ఆధారం అతడి చాట్ లిస్టే అని ఎన్సీబీ మీడియాకు ముందుగా లీకులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టుకు ఆ చాట్ లిస్టును సమర్పించింది.
దాంతో ఆర్యన్ అయిపోయాడని .. జాతీయ మీడియా గట్టిగా ప్రచారం చేసి పెట్టింది. అయితే ఈ అంశంపై స్పందించిన ముంబై కోర్టు.. ఆర్యన్ చాట్ లిస్టులో అభ్యంతకరమైనవి ఏమీ లేవని స్పష్టం చేసింది. ఆ చాట్ ప్రకారం… అతడిపై డ్రగ్స్ విషయంలో కుట్ర చేశాడనే అభియోగాలను మోపడానికి వీల్లేదని కోర్టు ప్రకటించింది. ఏ వాట్సాప్ చాట్ అయితే ఈ వ్యవహారంలో సంచలనంగా నిలుస్తుందన్నారో, ఆ వాట్సాప్ చాట్ లోనే విషయం ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే ఆర్యన్ ఖాన్ స్నేహితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్ మోతాదు చాలా పరిమితం. ఆరు గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికినట్టుగా ఎన్సీబీ స్వయంగా పేర్కొంది. డ్రగ్స్ కేసుల్లో మోతాదులను బట్టే.. కేసులు, శిక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని ఆర్యన్ న్యాయవాదులు ప్రస్తావించారు. కోర్టు కూడా ఆ మేరకు స్పందించింది. వారి వద్ద లభించిన డ్రగ్స్ పరిమాణం చిన్నదని పేర్కొంది.
ఈ కేసులో అటు ఇటుగా నలభై మంది ఎన్సీబీ రకరకాల అభియోగాలతో కోర్టును ఆశ్రయించగా, వాటి విషయంలో కోర్టు నుంచి ఎలాంటి సానుకూలతా రాలేదు. వాట్సాప్ చాట్ ఆధారంగా అంటూ హీరోయిన్ అనన్యా పాండేను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే!
కానీ.. ఆమె విషయంలో కూడా ఆ తర్వాత ఎన్సీబీ ఎలాంటి అడుగూ ముందుకు వేయలేదు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ సన్నిహితులకు కూడా కోర్టు వ్యాఖ్యలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. ఏతావాతా.. ఈ కేసును భారీ సంచలనంగా నిలిపిన ఎన్సీబీ అభియోగాలకు కోర్టు నుంచి ఎలాంటి మద్దతూ లభించకపోవడం గమనార్హం.