నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మేనత్త కుమారుడైన నారా లోకేశ్ యువగళం పేరుతో ఇవాళ కుప్పంలో పాదయాత్ర మొదలెట్టడాన్ని పురస్కరించుకుని, అతనికి మద్దుతుగా తారకరత్న అక్కడికి వెళ్లారు.
గత కొంత కాలంగా తారకరత్న రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తానని ఇటీవల ఆయన ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యక్రమాల్లో తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కుప్పానికి వెళ్లారు. లక్ష్మీపురం మసీదు వద్ద సొమ్మసిల్లి ఆయన కింద పడ్డారు. దీంతో ఆయన్ను హుటాహుటీన దగ్గరలో ఉన్న కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
తమ వద్దకు తీసుకొచ్చే సమయానికి పల్స్ లేదని వైద్యులు తెలిపారు. శరీరం బ్లూగా మారిందన్నారు. వెంటనే ట్రీట్‌మెంట్ మొదలు పెట్టామని, 45 నిమిషాల తర్వాత పల్స్ వచ్చినట్టు వైద్యులు చెప్పారు. కోలుకుంటాడని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు బెంగళూరుకు తరలించే ఆలోచనలో నందమూరి కుటుంబ సభ్యులున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలోనే నందమూరి బాలకృష్ణ ఉంటూ, వైద్యసేవల్ని పర్యవేక్షిస్తున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.