ఎట్టకేలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. ఆయన ప్రతి అడుగును తెలుగు సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. జనంతో ఎలా మమేకం అవుతారో తెలుసుకోవాలనే ఆసక్తిని పౌర సమాజం కనబరుస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసుడికి పట్టాభిషేకం కావడంతో ఇది ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టమని చెప్పొచ్చు.
ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి ముందు నారా కుటుంబం కుప్పం వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయాన్ని లోకేశ్ కూడా పాటించారు. ముఖ్యంగా ముహూర్తాలను తూచా తప్పక పాటించే మేనమామతో పాటు పిల్లనిచ్చిన మామ అయిన నందమూరి బాలయ్య తన అల్లుడి వెంట వుండి మరీ ప్రతిదీ పాటింపజేయడం గమనార్హం.
పూజల అనంతరం లోకేశ్ అడుగులు ముందుకు పడ్డాయి. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్రెడ్డి, ఎంపీ రామ్మోహన్నాయుడు, అనిత తదితరులు వలయంగా ఏర్పడగా, వారి మధ్య లోకేశ్ నడవడం విశేషం. జనానికి నమస్కారం చేస్తూ, అలాగే పిడికిలి బిగిస్తూ ఏదో నినాదం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అయితే శ్రేణుల్లో ఉన్న ఉత్సాహం…. ప్రస్తుతానికి లోకేశ్‌లో కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టూ వున్న నాయకులతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. ప్రజానీకాన్ని పలకరించాల్సి వుంది. బహుశా అడుగులు పడే కొద్ది ఆ పని ఊపందుకోవచ్చు. నడుస్తున్న నేపథ్యంలో లోపాలను సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మెరుగుపరిచే యంత్రాంగం లోకేశ్‌కు కొదవలేదు.
లోకేశ్ కూడా ఎప్పటికప్పుడు తాను జనంతో మమేకం అవుతున్న తీరుపై విశ్లేషణ చేసుకుంటారు. ఇంకా ఎలా చేస్తే మంచి పేరు వస్తుందో సన్నిహితులతో చర్చించే అవకాశం వుంది. యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు పోటెత్తాయి. భవిష్యత్‌లో టీడీపీకి మంచి రోజులు వస్తాయనే ఆశ, ధీమా కార్యకర్తలు, నాయకుల్లో కనిపిస్తోంది. దాన్ని మరింత పెంచడమే లోకేశ్ ముందున్న లక్ష్యం. అందుకు ఏం చేయాలో లోకేశ్ ఆలోచించాల్సి వుంది.