పవన్‌కల్యాణ్ అజ్ఞానంపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన్ను చితక్కొట్టారు. జనసేనాని పవన్‌కల్యాణ్ ఎప్పుడు ఎట్లా మాట్లాడ్తారో ఆయనకే తెలియదు. పవన్‌కు దేనిపైనా కంట్రోల్ ఉన్నట్టు కనిపించడం లేదు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పవన్ వీరావేశంతో ప్రసంగించారు. తన తండ్రి, పెదనాన్నలు కమ్యూనిస్టులని, హేతువాదులని చెప్పుకొచ్చారు. దేవుళ్లపై విశ్వాసం లేదని ఆయన అన్నారు.
నానమ్మ దీపారాధన చేస్తే, ఆ వెలుగులో తన తండ్రి సిగరెట్ ముట్టించుకునే వాడని చెప్పి పవన్ తన అజ్ఞానాన్ని ప్రదర్శించారు. పవన్ మాటలను ప్రముఖ సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి కూడా తప్పు పట్టారు. ఏం మాటలివి అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులను దైవ వ్యతిరేకులుగా చిత్రీకరించే క్రమంలో ఇలా తండ్రిని కూడా తెరపైకి తెచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్‌కల్యాణ్ తప్పుని ఆసరాగా తీసుకుని మంత్రి అంబటి రాంబాబు రాజకీయ విమర్శలు చేయడం గమనార్హం. అయితే అంబటి ట్వీట్‌లో ఎక్కడా పవన్‌కల్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకపోవడాన్ని గమనించొచ్చు. కేవలం ఆయన అన్న మాటల్ని తీసుకుని ఘాటు విమర్శలు చేశారు.
“పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?” అని అంబటి నిలదీయడం గమనార్హం. నోరు జారితే ప్రత్యర్థుల నుంచి ఇలాంటి విమర్శలే వస్తాయి మరి. తాను ఏం మాట్లాడినా ఎవరూ ప్రశ్నించకూడదు, తప్పు పట్టకూడదని పవన్ అంటుంటారు. అలాంటి అవకాశాన్ని తమరే కదా సార్ ఇచ్చేదని ఎవరైనా ప్రశ్నిస్తే…. సమాధానం ఏం చెప్తారు?