దిగజారిన మీడియా

రాజకీయాల్లో విలువలు లోపించిపోయాయంటే… ఆ వ్యవహారం ఎన్నడో జరిగిపోయింది. మనం దానికి అలవాటు పడిపోయాం. రాజకీయాల్లో ఎవరైనా విలువలు పాటిస్తోంటే వారి గురించి వింతగా చెప్పుకుంటాం. కానీ మీడియాలో విలువలు లోపిస్తే బాధ కలుగుతుంది.…

రాజకీయాల్లో విలువలు లోపించిపోయాయంటే… ఆ వ్యవహారం ఎన్నడో జరిగిపోయింది. మనం దానికి అలవాటు పడిపోయాం. రాజకీయాల్లో ఎవరైనా విలువలు పాటిస్తోంటే వారి గురించి వింతగా చెప్పుకుంటాం. కానీ మీడియాలో విలువలు లోపిస్తే బాధ కలుగుతుంది. ఎందుకంటే మీడియా మీద ప్రజల్లో ఇప్పటికీ కొంత నమ్మకం మిగిలిఉంది. మిగిలిన అన్ని వ్యవస్థల్లో పెడపోకడలు తలెత్తినా కూడా.. ఈ మీడియా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వాటిని చక్కదిద్దగలుగుతుందనే ఆశ ప్రజల్లో ఉంది. కానీ మీడియా విలువల పతనం కంటె.. మరింత లోతుగా దిగజారిపోతే ఏం చేయాలి?

కేవలం ఒక నాయకుడిమీద, ఒక పార్టీ మీద కక్షతో, వారిని యావత్ ప్రజల దృష్టిలో విలన్లుగా చిత్రీకరించాలనే దుగ్ధతో.. విషపురాతలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ దిగజారుడుతనానికి అంతం ఎక్కడ? అసహ్యమైన బ్లాక్‌మెయిల్ వ్యవహారాలను ‘యెల్లో మీడియా’ అనే పదంతో పెద్దలు సూత్రీకరించారు. కానీ వర్తమానంలో.. ‘యెల్లో మీడియా’ అంటే.. తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే… చంద్రబాబునాయుడు ఓడిపోయినందుకు విలపించే… జగన్‌ను తక్షణం పదవీభ్రష్టుడిని చేసేయాలని తపన పడే మీడియా మాత్రమే.. అని నవీన నిర్వచనానికి దిగజారిపోయింది. అన్నింటికంటె హేయమైన సంగతి ఏంటంటే… ఇలాంటి కుట్రలకి ‘మతాన్ని’ వాడుకుంటుండడం. 

‘రాజకీయ మీడియా’.. తప్పు కాదు
మనదేశంలో పత్రికలు రాజకీయ పార్టీలతో అంటకాగడం, కొన్ని పార్టీలకు కొమ్ముకాయడం ఇవాళ్టి పరిణామం కాదు. పత్రికలు పుట్టిన నాటినుంచి అలాంటి పోకడ ఉంది. తొలినాళ్లలో ఉద్యమాలకు, పోరాటలకు అనుకూలంగా పత్రికలు పుట్టాయి. ఖర్మం ఎక్కడినుంచి మొదలైందంటే.. తర్వాత ఆ ఉద్యమాలు రాజకీయ పార్టీలుగా రూపుదిద్దుకున్నాయి. ఆ పత్రికలకు వాటితో అనుబంధం అలాగే ఉండిపోయింది. ఆ తర్వాతి తరాల్లో పత్రికలు పెట్టేవాళ్లు.. రాజకీయ అనుబంధం, పార్టీకి కొమ్ముకాయడం ఒక విధానంగా స్వీకరించే దుస్థితి వచ్చింది. ప్రజలు కూడా రాజకీయ కరపత్రాలుగా వస్తున్నాయని తెలిసిన పత్రికలను ఆమోదించడం ప్రారంభించారు. 

ఈ పరిణామాన్ని మనం తప్పుకింద భావించక్కర్లేదు. తెలుగుదేశాన్ని ఈనాడు భుజానికెత్తుకున్నా, సాక్షి జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కంకణం కట్టుకున్నా భారతీయ మీడియా మూలాల్లో ఉన్న వాసనల ఫలితమే అనుకోవచ్చు. కానీ.. అలాంటి ప్రయత్నంలో ఆ పత్రికలు హద్దులు మరచిపోయిన సందర్భాలను కూడా ప్రజలు భరించారు, సహించారు. కానీ.. ఇప్పుడు పత్రికలు సమాజ వినాశనాన్ని లక్ష్యించినట్లుగా విషం కక్కుతున్నాయి. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో క్రిస్టియానిటీ ప్రబలేలా చేయడానికి, కొత్తగా బీసీ వర్గాల వారిని కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేసేలా ఉపకరించడానికి పనిచేస్తున్నదనే  ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు.

చేతగానితనానికి పరాకాష్ట
కొన్ని పత్రికల లక్ష్యాలు చంద్రబాబునాయుడును గద్దెమీద కూర్చోబెట్టడం. ఆయన గద్దెదిగే పరిస్థితి రాకుండా చూడడం. అందుకు ప్రజల్ని తమ రాతలతో మోసం చేయడానికి, ఆయనకు భజన చేయడానికి వారు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. వారి కుయత్నాలు ఎంతగా చేసినప్పటికీ..  ప్రజలు చంద్రబాబును ప్రతిపక్షానికి పరిమితం చేసారు. వారిలో ఇప్పుడు హటాత్తుగా ఓర్వలేని తనం పెరిగింది. జగన్‌ను అర్జంట్‌గా గద్దె దించేయాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఎంతమాత్రమూ పనికిరాడని ప్రజల ఎదుట నిరూపించాలి. అదీ వారి లక్ష్యం.

కొంతకాలం అదే పని చేశారు. ప్రభుత్వం చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు.. దానిని భూతద్దంలో చూపించడం.. ప్రగతి నిరోధకంగా ప్రచారం చేయడం ఇవన్నీ సాగాయి. కరకట్ట ఆక్రమణల దగ్గరినుంచి, రాజధాని తరలిపోయిందని, అమరావతి అంతరించిపోయిందని, ఇసుక కొరతతో రాష్ట్రమంతా ఆత్మహత్య చేసేసుకుంటున్నదని ఇలా రకరకాల ప్రచారాలు సాగాయి. కానీ, ప్రజల ఆమోదించలేని అబద్ధాన్ని ప్రచారంలో పెట్టదలచుకుంటే.. అవెప్పుడూ తాటాకు మంటలాగా చప్పున చల్లారిపోతాయి. ఇప్పటిదాకా జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు సాగించిన పోరాటాలు, వాటికి దన్నుకాసిన మీడియా ప్రయత్నాలు అలాగే అంతరించిపోయాయి. నిర్దిష్టంగా, కచ్చితంగా.. జగన్ చేస్తున్న పనుల్లో ప్రజలను ‘నిజంగా’ ఇబ్బంది పెడుతున్న, ప్రజలందరూ అసంతృప్తిగా భావిస్తున్న అంశాలేవీ ఈ మీడియాకు కనపడ్డం లేదు. అందుకే వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు.లేనిపోని అభూతకల్పనలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి కుట్రలు రచిస్తున్నారు. 

జగన్‌ను అప్రతిష్ట పాల్జేయడానికి చేస్తున్న ఈ కుట్ర మొత్తం తెలుగు జాతినే విచ్ఛిన్నం చేసేది.

మతవిద్వేషాలను రెచ్చగొట్టి.. సమాజాన్ని సర్వనాశనం చేయడానికి, మీడియా నడుం బిగించి.. ముందుకు సాగుతుండడం అసహ్యం పుట్టిస్తోంది.

ఖలునకు నిలువెల్ల విషము…
తలనుండు విషము ఫణికిని /వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ /తలతోక యనక యుండును /ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ! 

అని శతకారుడు చెప్పాడు. పాముకు తలలో, తేలుకు తోకలో విషముంటే.. దుర్మార్గుడికి ఒళ్లంతా విషమే ఉంటుందిట. ఇప్పుడు దిగజారడంలో ఘనత వహించిన తెలుగు పత్రికలు, వాటి యజమానులు ఇలా ఒళ్లంతా విషాన్ని నింపుకుని.. యావత్ తెలుగు రాష్ర్టమ్మీద అదే విషాన్ని చిమ్ముతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా సంక్షేమ పథకాల ఊపులో నిశ్చింతగా జీవితం గడుపుతున్నారు. ఇలాంటి సౌభ్రాత్ర సహజీవనాన్ని అందరూ కలిసి మెలిసి ఉండడాన్ని ఈ కుట్రదారులు చూడలేకపోతున్నారు. రాష్ట్రం ఇలా ప్రశాంతంగా ఉండడం వలన తాము కొమ్ముగాసే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదేమోననే భయం వారిని వెన్నాడుతోంది. అందుకే ప్రజల్లో కలతలు సృష్టించడానికి, అనుమానాలు భయాలు రేకెత్తించడానికి, ఒకరిని ఒకరు అనుమానపు దృక్కులతో చూసుకుంటూ పరస్పర అసహనంతో గడపడానికి కూహకాలను రచిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో హిందువులు వెర్సస్ క్రిస్టియన్లుగా సమాజం వీడిపోవడానికి ఇప్పుడు బీజం పడుతున్నదిట… జగన్మోహన రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ ఇందుకు అనుగుణంగానే ఉన్నాయిట. ఎంతటి దుర్మార్గమైన వ్యాఖ్యలు ఇవి. ఏమాత్రం సమాజస్పృహ, బాధ్యత లేకుండా రాస్తున్న తప్పుడు రాతలు ఇవి. పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో చదువు చెప్పాలనుకోవడం, వారిని అంతర్జాతీయంగా ఉండగల అవకాశాలకు సంసిద్ధులుగా తయారు చేయాలనుకోవడం కూడా క్రిస్టియానిటీ వ్యాపింపజేయడానికి జరుగుతున్న కుట్రగా అభివర్ణించే ధూర్త శిఖామణులను ఏం అనుకోవాలి. 

క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లలో జరుగుతున్నదంతా మతమార్పిడే అన్న చందంగా దుర్మార్గపు రాతలు రాసేస్తున్నారు. ఇంగ్లిషు మీడియం అనేది మనకు అలవాటు లేని రోజుల్లో మిషనరీ స్కూళ్లు సేవచేశాయి. ఆ మాటకొస్తే మిషనరీ ఆస్పత్రులు అంతకంటె ఎక్కువ సేవ చేశాయి. అక్కడ చదువుకున్న, చికిత్సలు చేయించుకున్న వాళ్లంతా మతం మారిపోలేదు. ఇది నిస్సందేహంగా విషం కక్కడమే. పైగా ఇంగ్లిషు మీడియం వలన క్రిస్టియనీకరణ జరుగుతుందంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఏంటి హేతువు?

మీడియం ఇంగ్లిషులోకి మార్చడం మాత్రమే ప్రభుత్వం చేస్తున్నది. సిలబస్‌లో ఏమైనా తేడా వచ్చిందంటే.. అప్పుడు జగన్ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థముంది. అంతే తప్ప.. కేవలం ఇంగ్లిషులో చదువుకున్న వాళ్లంతా క్రిస్టియానిటీ వైపు మొగ్గుతారన్నట్లుగా అజ్ఞానపు రాతలు రాస్తే ఎలా?

ప్రజలు పిచ్చివాళ్లు కాదు…
విషాన్ని చిమ్ముతున్నారు సరే.. ఆ విషాన్ని ప్రజల దాకా ఎలా వెళుతుంది? తీసుకెళ్లడానికి మధ్యలో వాహకంగా పనిచేసేవాళ్లకి, ఈ విషప్రచారాలకు తాము కూడా ‘టూల్స్’గా మారుతున్నాం అనే అసహ్యం పుడితే దానికి ఎవరేం చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఛానెల్ ప్రసారాలు ఆగిపోయాయంటే… కారణం ఇదే. ఛానెల్ ద్వారా విషం చిమ్మడం ఆ రకంగా నియంత్రణ అయింది. అయితే పత్రిక మాత్రం యథాతథంగా విషం చిమ్ముతూనే ఉంది. చీమ చిటుక్కుమంటే.. అది రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్మోహనరెడ్డి కుట్రగా అభివర్ణించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాల్సింది ఒకటుంది.

ఎన్నికల ముందు ఇంతకంటె పెద్ద కుట్రలే చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే.. రాష్ట్రం నాశనమైపోతుందని ప్రజల మెదళ్లలోకి విషం ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు విజ్ఞలు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టారు. అనన్యమైన మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గెలిపించిన ప్రజలనే చీల్చేందుకు కొత్త కుట్ర జరుగుతోంది. నిజంగా ప్రజాకంటక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే గనుక.. ప్రజలు ఊరుకోరు. తమకు కడగండ్లు వస్తే తామెలా స్పందించాలో వారికి తెలుసు. జగన్ కాదు కదా.. ఎంత కొమ్ములు తిరిగిన ప్రభుత్వమైనా ప్రజలను మించింది కాదు. వారు.. జగన్ నిర్ణయాలను ఆమోదిస్తున్నారు గనుకనే.. అవి కార్యరూపం దాలుస్తున్నాయి. రాజకీయ వక్ర ప్రయోజనాలకోసం విపక్షాలు సాగిస్తున్న పోరాటాలు, నిరసనల్లో నిజం లేదు గనుకనే అవి నీరుగారిపోతున్నాయి. ఇలాంటి ససాక్ష్యమైన పరిణామాలను ఈ కుట్రపత్రికలు గ్రహించాలి. ప్రజల మధ్య సహజీవనాన్ని, స్నేహశీలతను చంపేసే ప్రయత్నం జరిగితే.. అది బూమరాంగ్ అవుతుందని తెలుసుకోవాలి.  ఇలా విషం చిమ్మడాన్నే కొనసాగిస్తే గనుక… టీవీ ఛానెల్ ను మరచిపోయిన ప్రజలే.. పూనుకుని పత్రికకు కూడా సమాధి కట్టేస్తారు.