‘దేవభూమి’లో కొత్తరకం కేబినెట్‌…!

దేవభూమిలో కొత్త రకం కేబినెట్‌ ఏమిటి? ఇదేదో వింతగా అనిపిస్తోంది కదూ. అసలు దేవభూమి అనేది ఎక్కడ ఉంది. స్వర్గంలో ఉందా? కాదండి. ఇండియాలోనే ఉంది. దేవభూమి అంటే ఎవ్వరికీ అర్థం కాదు. కాని…

దేవభూమిలో కొత్త రకం కేబినెట్‌ ఏమిటి? ఇదేదో వింతగా అనిపిస్తోంది కదూ. అసలు దేవభూమి అనేది ఎక్కడ ఉంది. స్వర్గంలో ఉందా? కాదండి. ఇండియాలోనే ఉంది. దేవభూమి అంటే ఎవ్వరికీ అర్థం కాదు. కాని ఉత్తరాఖండ్‌ అంటే వెంటనే అర్థమైపోతుంది. దీన్ని దేవభూమి అని అంటారు.

ఎందుకంటే…ఇక్కడ ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రాలున్నాయి కాబట్టి. ముఖ్యంగా భారతీయులు పవిత్రంగా భావించే హిమాలయాలు ఇక్కడ కనువిందు చేస్తాయి. దీని పాత పేరు ఉత్తరాంచల్‌. తరువాత ఇది ఉత్తరాఖండ్‌గా మారింది. ఇది ఉత్తర ప్రదేశ్‌ నుంచి విడిపోయి 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 

సరేనండీ…ఈ హిస్టరీ అంతా ఇప్పుడెందుకు? అసలు విషయం చెప్పండీ అంటారా? అయితే ఓకే. ఉత్తరాఖండ్‌ కేబినెట్‌ అతి త్వరలోనే డిజిటల్‌గా మారబోతున్నది. అంటే పేపర్‌లెస్‌ కేబినెట్‌ సమావేశాల నిర్వహణ అన్నమాట. సాధారణంగా మీటింగ్‌ అనగానే కాగితాలు, కలాలు పట్టుకొని కూర్చునే దృశ్యమే మనకు కనబడుతుంది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి. టెక్నాలజీ వెయ్యి కాళ్ల జెర్రి మాదిరిగా పెరిగిపోయాక ఇంకా కలాలు , కాగితాలు పట్టుకొని కూర్చోడం, రాసుకోవడం ఏమిటి? అందుకే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం డిజిటల్‌ కేబినెట్‌ అంటోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే 'ఈ-కేబినెట్‌' అమలు చేయడానికి యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది.

ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి , వివిధ శాఖలు అధిపతులకు కాన్ఫిడెన్షియల్‌ డాక్యుమెంట్లు సైతం ఈ-మెయిల్‌ ద్వారానే పంపుతారు. పాలనలో పేపర్‌ అనేది కనబడకుండా చేయాలనేది లక్ష్యం. ప్రతి కేబినెట్‌ సమావేశానికి 20 వేల షీట్ల పేపర్‌ ఉపయోగిస్తున్నారు. ప్రతి కేబినెట్‌ సమావేశంలో సుమారు 15 అంశాలపై చర్చ జరుగుతుంది. ఒక్కో ప్రతిపాదన తయారీకి 10 నుంచి 15 పేపర్లకు పైగానే ఉపయోగిస్తారు. ప్రతి ప్రతిపాదనను 20 సెట్లు తయారు చేసి పంపిణీ చేయాలి. కేబినెట్‌ సమావేశం తరువాత చర్చనీయాంశాలను, తీసుకున్న నిర్ణయాలను అన్ని డిపార్టుమెంట్లకు, మంత్రుల కార్యాలయాలకు, అధికారులకు పంపాలి. దీంతో భారీగా కాగితం ఖర్చవుతోంది. ఇంత ఖర్చు అవసరమా?

అందుకే డిజిటల్‌ విధానం ప్రవేశపెడుతోంది ప్రభుత్వం. దీనివల్ల పేపర్‌ ఖర్చు లేకపోవడమే కాదు, పేపర్‌ వృథా కూడా ఉండదు. ప్రస్తుతం లాన్‌ (లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) డెవెలప్‌ చేసే పని, కేబినెట్‌ సమావేశాలు నిర్వహించే హాలుకు కేబుల్స్‌ వేసే పని శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడున్న విధానంలో కేబినెట్‌ ఎజెండా కాపీలు ముందురోజే మంత్రుల ఇళ్లకు లేదా వారి ఆఫీసులకు పంపుతున్నారు. వారు ఊళ్లో (రాజధానిలో) ఉంటే ఎజెండా అధ్యయనం చేస్తున్నారు. లేకపోతే ఎజెండా చదవకుండానే సమావేశానికి హాజరవుతున్నారు. డిజిటల్‌ విధానం వచ్చాక ఇలా ఉండదు. మంత్రులు ఊళ్లో ఉన్నా లేకపోయినా ఎజెండా వారికి చేరిపోతుంది. ప్రతి మంత్రికి అవసరమైన సాఫ్టవేర్‌, స్పెసిఫికేషన్స్‌తో స్క్రీన్‌ టచ్‌ లాప్‌టాప్‌లు ఇస్తారు. 

ప్రతి మంత్రికి విర్చ్‌వల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ద్వారా (విపిఎన్‌) ఎజెండా పంపిస్తారు. దీనికి సంబంధించిన మెసేజ్‌  మొబైల్‌ ఫోన్‌కు పంపుతారు. ప్రతి మంత్రికి వ్యక్తిగత లాగిన్‌, పాస్‌వర్డ్‌ ఇస్తారు. దీంతో అతను ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా ఎజెండా చదువుకోవచ్చు. మంత్రులందరూ కేబినెట్‌ సమావేశానికి కచ్చితంగా లాప్‌టాప్‌లతో రావల్సివుంటుంది. సమావేశం ముగిశాక అవసరమైన సమాచారాన్ని విపిఎన్‌ ద్వారా పంపుతారు.

డిజిటల్‌ టెక్నాలజీకి సంబంధించి మంత్రులకు, వారి ప్రైవేటు కార్యదర్శులకు, సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చేశారు. మారుతున్న కాలానికి, టెక్నాలజీకి అనుగుణంగా సామాన్యులైనా, మంత్రులైనా మారకతప్పదు. ఇదంతా చేతకాదని, కలం, కాగితం ఉపయోగిస్తూ ఎంచక్కా రాసుకుంటానంటే ఇక కుదరదు.