పవన్ కల్యాణ్.. అప్ డేట్ అవ్వాలి, 1996 కాదిది!

ప్రపంచం అప్ డేట్ అవుతూ ఉంది పవన్ కల్యాణ్. దానికి రాయలసీమ కూడా అతీతం కాదు. ఇంకా ఎప్పటిదో అట్టలు చినిగిపోయిన పుస్తకాన్ని పోస్టు చేసి దాన్ని చదవమంటూ హితోపదేశాలు చేస్తే ఎలా? గణాంకాలు…

ప్రపంచం అప్ డేట్ అవుతూ ఉంది పవన్ కల్యాణ్. దానికి రాయలసీమ కూడా అతీతం కాదు. ఇంకా ఎప్పటిదో అట్టలు చినిగిపోయిన పుస్తకాన్ని పోస్టు చేసి దాన్ని చదవమంటూ హితోపదేశాలు చేస్తే ఎలా? గణాంకాలు కావొచ్చు పరిస్థితులు కావొచ్చు.. ఏయేటికాయేడు మారిపోతూ ఉంటాయి. అలాంటిది ఇంకా దాదాపు పాతికేళ్ల కిందట ప్రచురించిన ఎవరో ప్రచురించిన పుస్తకాన్ని పట్టుకుని దాన్ని కూడా జగన్ మీద దాడికి వాడుకోవాలని చూడటం పవన్ కల్యాణ్ అక్కసును తెలియజేస్తూ ఉంది.

ఇంతకీ పవన్ సారు ఏమంటారంటే.. ''1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో, అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది..'' అంటూ ఒక పుస్తకాన్ని ట్వీట్ చేశారు.

ఆయనే చెబుతూ ఉన్నారు, అది నాటి పుస్తకం అని. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు గురించి పవన్ కల్యాణ్ కు తెలియకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం బాగా తెలుసు. 

''మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది  రాయల సీమ లోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది, మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే   నా గుండె కలిచి వేసింది.'' అంటూ మరో ట్వీటేశారు పవన్ కల్యాణ్.

ఉన్నట్టుండి ఈయనకు ఇలా రాయలసీమ మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. మరి ఇంత ప్రేమ ఉండే.. అనంతపురం నుంచి తను పోటీ చేస్తానంటూ ఆ మధ్య ప్రకటించారు. కానీ ఎన్నికల్లో మాత్రం తన కులస్తుల ఓట్లు గట్టిగా ఉన్న చోటకెళ్లి పోటీ చేశారు. అక్కడ కూడా నెగ్గలేకపోయారనుకోండి.

అలాగే ఈ పుస్తకంలో 'శ్రీ జగన్ రెడ్డి' ప్రస్తావన ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. అంటే అప్పటికి జగన్ వయసు దాదాపుగా ఇరవై యేళ్లు ఉండొచ్చు. ఆ ప్రస్తావన ఏమిటో పవన్ చెప్పలేదు. పాతికేళ్ల తర్వాత కూడా పాత పుస్తకాల్లోని ప్రస్తావనలతో పవన్ ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. విశేషం ఏమిటంటే.. ఈ పుస్తకం అచ్చయ్యే నాటికి అదే రాయలసీమ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు. ఆయన ప్రస్తావన మాత్రం పవన్ తీసుకురాలేదు!