బాబు ఏడుపుగొట్టు రాజకీయం.. ఆట ఇప్పుడే మొదలైంది

బాబు ఏడుపు అందుకున్నారు. ఇదేదో కేవలం ఈ అసెంబ్లీ సెషన్ కి పరిమితమైన నాటకం కాదు. ఇంకా చెప్పాలంటే ఆట ఇప్పుడే మొదలైంది. తన ఏడుపుగొట్టు ఎపిసోడ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకోవడమే…

బాబు ఏడుపు అందుకున్నారు. ఇదేదో కేవలం ఈ అసెంబ్లీ సెషన్ కి పరిమితమైన నాటకం కాదు. ఇంకా చెప్పాలంటే ఆట ఇప్పుడే మొదలైంది. తన ఏడుపుగొట్టు ఎపిసోడ్ ను ఫుల్ గా క్యాష్ చేసుకోవడమే బాబు లక్ష్యం. 

ఇలాంటి విషయంలో ఎప్పుడో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడీ ఏడుపు ఎపిసోడ్ ను వచ్చే ఎన్నికల వరకు వేడివేడిగా రగల్చడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఇకపై టీడీపీ నుంచి వేరే ఆందోళనలు ఉండవు.. ఎన్నికల వరకు ఈ ''ఏడుపుగొట్టు'' అంశమే వాళ్లకు శ్రీరామరక్ష. 

అసెంబ్లీలో నిన్న జరిగిందేం లేదు. కానీ కానీ బాబు సీన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తారు. అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోరుతారు. ఈ సాకుతో మోదీ, అమిత్ షాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. అమరావతి ఉద్యమాన్ని ఇటు డైవర్ట్ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తారు.

లేదంటే దీన్ని సాకుగా చూసి తానే స్వయంగా బస్సు యాత్రకు దిగుతారు. ఇలా తన ఏడుపుగొట్టు అంశాన్ని ఫుల్ గా వాడుకోవాలని చంద్రబాబు ప్రిపేర్ అయిపోయారు. ఆల్రెడీ స్కెచ్ కూడా రెడీ అయిపోయింది. ఈరోజు ఎల్లో మీడియా పత్రికల్లో హెడ్ లైన్స్ చూస్తే బాబు స్కెచ్ కు పునాది అక్కడే పడిందనే విషయం ఈజీగా అర్థమైపోతుంది.

పచ్చ మీడియా సపోర్ట్ మామూలుగా లేదు..

చంద్రబాబు చిన్న ట్వీట్ చేసినా దాన్ని హైలెట్ చేసి హెడ్డింగ్ పెట్టే మీడియా ఆయనకు సపోర్ట్ ఉంది. అలాంటిది చంద్రబాబు ఏకంగా ఏడ్చేశారు. మరి దీన్ని ఊరికే వదిలిపెడతారా. అది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ బాబు మాటల్నే హెడ్డింగ్ పెట్టింది ఆంధ్రజ్యోతి. 

విలపించిన చంద్రబాబు అంటూ సింపతీ రగిల్చే హెడ్డింగ్ పెట్టి హైలెట్ చేసింది ఈనాడు. నిన్నంతా సోషల్ మీడియాలో బాబుపై పేలిన సెటైర్లు చూసిన జనాలకు ఈరోజు పేపర్ హెడ్డింగ్ లతో బుర్ర తిరిగి పోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకిలా రాశారు, బాబు సమస్య జాతీయ సమస్య ఎప్పుడైంది అనేది ఎవరికీ అర్థం కాలేదు.

తన ఏడుపుని తానే క్యాష్ చేసుకునే పనిలో..

చంద్రబాబు ఏడ్చారు, కానీ ఆ ఏడుపుని ఇప్పుడు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగూ ఏడ్చారు కాబట్టి, దాని వల్ల తనకి, తన పార్టీకి ఎంత మైలేజీ పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు బాబు. 

ఎన్నికల వరకు ఈ ఏడుపు ఎపిసోడ్ ని ఎలా కంటిన్యూ చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు యాత్ర చేయాలనేది ఎప్పటినుంచో ఉన్న ఆలోచన. కానీ దానికి సరైన సమయం, సందర్భం దొరకడంలేదు. అమరావతి ఇష్యూ, ఆంధ్రా అప్పులు.. వంటివన్నీ చిన్న చిన్న సమస్యలుగానే తోచాయి.

కానీ ఇప్పుడు భార్య పేరు చెప్పి చంద్రబాబు ఏడవడం అనేది ఏపీ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. సింపతీ అనొచ్చు, డ్రామా అనొచ్చు.. ఒక్కసారిగా బాబు వ్యవహారం జనాల్లో చర్చకు వచ్చింది. దీన్ని ఇలా ఆపేయడం కంటే కొనసాగించడానికే చంద్రబాబు ఇష్టపడుతున్నారు కాబట్టి.. కచ్చితంగా యాత్ర వివరాలను ఆయన త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.

అధికారం కోసం పరువు తీసుకుంటున్న బాబు..

అధికారం కోసం ఎంత నీఛానికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది అని అందరికీ తెలుసు. అయితే తన కుటుంబం పరువును కూడా తనకు తానే తీసేసుకుంటారని తాజా ఎపిసోడ్ తో రుజువైంది. 

ఎవరు ఎవరిని ఏమన్నారో తెలియదు కానీ, చంద్రబాబు తన భార్య పేరుని తానే బయటపెట్టుకుని మరీ ఏడుపు సీన్ రక్తికట్టించారు. ఈ ఏడుపుతో అసెంబ్లీని ఎగ్గొట్టి, ఏకంగా సీఎం కుర్చీనే టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబు అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది.