మహారాష్ట్ర నంబర్ గేమ్.. ప్రస్తుతానికి ఇలా!

రసవత్తరంగా మారిన మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో..నంబర్ గేమ్ ప్రస్తుతానికి ఇలా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడమే ఈ నంబర్ గేమ్ ప్రత్యేకత.  Advertisement ఎన్నికల ఫలితాలను…

రసవత్తరంగా మారిన మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో..నంబర్ గేమ్ ప్రస్తుతానికి ఇలా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడమే ఈ నంబర్ గేమ్ ప్రత్యేకత. 

ఎన్నికల ఫలితాలను అనుసరించి..భారతీయ జనతా పార్టీ -105, శివసేన -56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44. ఇవీ ప్రధాన పార్టీల బలాబలాలు. 

ఇక చిన్నాచితక పార్టీల నుంచి 16 మంది, ఇండిపెండెంట్లు మరో 13 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. వీరి విషయంలో ఎవరికి వారు క్లైమ్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్లలో ఏడు మంది తమ వైపు ఉన్నారని శివసేన, 14 మంది తమతో ఉన్నారని బీజేపీ ప్రకటించుకుంటున్నాయి. అయితే ఎవరు ఎవరితో ఉన్నారో.. బల పరీక్ష జరిగితే కానీ తెలియదు.

మరోవైపు ఎన్సీపీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆసక్తిదాయకమైన ప్రకటన ఒకటి చేసింది. ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఇప్పటికే అజిత్ పవార్ ను ఎన్నుకోవడం జరిగిందని, ఆయనకు విప్ జారీ చేసే అవకాశం ఉంటుందని బీజేపీ అంటోంది. బలపరీక్ష సమయంలో అజిత్ పవార్ జారీ చేసే విప్ కు అనుగుణంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుందని బీజేపీ నొక్కి వక్కాణిస్తూ ఉంది!

తమకు ఇదో సువర్ణావకాశం అయినట్టుగా బీజేపీ చెబుతూ ఉంది. అయితే ఎన్సీపీ ఎమ్మెల్యేలు అంతలోనే సమావేశం అయ్యి, అజిత్ పవార్ ను తమ నేత హోదా నుంచి తొలగించామని అంటే? మరొకరిని తమ లెజిస్లేటివ్ విభాగం నేతగా ఎన్నుకున్నామని ఆ పార్టీలు ప్రకటిస్తే? 

ఏతావాతా అజిత్ పవార్ వెంట ఎమ్మెల్యేలు కనపడటం లేదని స్పష్టం అవుతోంది. అజిత్ పవార్ ను కాకుండా.. శరద్ పవార్ ను బీజేపీ బలపరీక్షలోగా ప్రసన్నం చేసుకుంటే తప్ప బీజేపీ ప్రభుత్వం నిలబడే అవకాశం కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. అది సాధ్యమేనా? ఈ చిత్రవిచిత్రాలు చూస్తుంటే.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.