'' 'బద్లా' సినిమాకు నేనే ఎక్కువ రోజులు పని చేశాను.. ఆ సినిమా కోసం అమితాబ్ పని చేసిన రోజులు తక్కువ. అయినా ఆ దాన్ని ఆయన సినిమా అనే అంటారు..'' ఇదీ తాప్సీ ఆవేదన. ఆ మధ్య హిందీలో వచ్చి విజయం సాధించిన సినిమా గురించి తాప్సీ ఇలా స్పందిందిచింది. ఆ సినిమా గురించి మరింత చెప్పాలంటే దాన్నే తెలుగులో 'ఎవరు' పేరుతో తీశారు.
తెలుగు వెర్షన్లో రెజీనా చేసిన పాత్రనే హిందీలో తాప్సీ చేసింది. వీటన్నింటికీ మూలం ఒక విదేశీ సినిమా. ఆ సంగతలా ఉంటే.. ఈ హీరోయిన్ అప్పుడే అమితాబ్ తో పోల్చేసుకుంటూ ఉండటం విశేషం. ఏ రకంగా చూసినా.. ఆ సినిమాలో అమితాబ్ దే ప్రధాన పాత్ర.
తెలుగు వెర్షన్లో అడవి శేష్ ఆ పాత్రను చేశాడు. హిందీ వెర్షన్ కు కొన్ని మార్పులు చేసి ఆ పాత్రను యంగ్ గా మార్చారు. అయినప్పటికీ.. ఆ సినిమాలో అమితాబ్ దే ప్రధాన పాత్ర. ఆ సినిమా మార్కెటింగ్ కూడా చాలా వరకూ అమితాబ్ పేరు మీదే జరిగింది. ఆ సినిమాలో తాప్సీకి ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. దాని కోసం ఆమె ఎక్కువ రోజులు పని చేసి ఉండవచ్చు గాక!
అలా అంటే కొన్ని సినిమాల్లో హీరో ల కన్నా కమేడియన్లు ఎక్కువ సయమం పని చేసి ఉండవచ్చు. అలాగని వాటిని ఆ కమేడియన్ల సినిమాలుగా వ్యవహరించరు కదా. ఒకవేళ తాప్సీ ఎవరైనా చోటామోటా హీరోతో ఆ సినిమాను చేసి ఉంటే… అప్పుడు అది ఆమె సినిమాగా ప్రచారం వచ్చేది.
అయితే అమితాబ్ వంటి మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలో నెగిటివ్ రోల్ చేసి.. ఆ సినిమా తనదని ప్రచారం రాలేదని తాప్సీ చెప్పుకోవడం ఆమె తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్న వైనాన్ని చాటుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.