కన్నడీగులకు సూచనలు ఇచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేయించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు కామ్ గా ఉన్నారనే ప్రశ్న ఆయన అభిమాన వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు దేశంలో తనకు మించిన సీనియర్ లేరని చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అదే చెబుతారనుకోండి!
అంతేనా.. అప్పట్లో చంద్రబాబుగారి చక్రాలకు హద్దే ఉండేది కాదు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు హంగ్ తరహా ఫలితాలు వచ్చినప్పుడు ఈయనే అక్కడ చక్రం తిప్పారని ఎల్లో మీడియా వర్గాలు గట్టిగా చెప్పుకొచ్చాయి. అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఐడియాను కాంగ్రెస్-జేడీఎస్ లకు ఇచ్చిందే చంద్రబాబు అని అప్పట్లో గట్టిగా చెప్పాయి పచ్చ వర్గాలు!
చంద్రబాబు ఐడియా ఇవ్వకపోతే సోనియాకు తట్టేది కాదని, దేవేగౌడ నిద్రనుంచి లేచే వాళ్లు కాదని.. వారికి అవకాశం గురించి చెప్పింది చంద్రబాబే అని అప్పట్లో ఒక రేంజ్ లో ప్రచారం చేశారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడటం చంద్రబాబు ఘనతే అని ప్రచారం చేశారు!
కట్ చేస్తే.. ఇప్పుడు మహారాష్ట్రలో హంగ్ ఏర్పడింది. లోక్ సభ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు కూడా ప్రచారానికి వెళ్లారు. శరద్ పవార్ తో వేదిక పంచుకున్నారు. అక్కడి తెలుగు వాళ్లకు చంద్రబాబు ఓటు విషయంలో దిశానిర్దేశం చేశారు!
మరి ఇప్పుడు అక్కడ రాజకీయ నాటకం పతాక స్థాయికి చేరింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కిమ్మనడం లేదు. ఫోన్లు చేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుండాలో తేల్చాల్సిన చంద్రబాబు నాయుడు అసలు మ్యాటర్ మీద లీకులే ఇవ్వడం లేదు.
అటు సోనియాకు ఫోన్ చేసి మంత్రాంగం చేస్తున్నారా, లేక ఇక పవార్ కు ఆదేశాలు ఇస్తున్నారా, శివసేనకు మార్గాన్ని బోధిస్తున్నారా, ఇవ్వన్నీ గాక ఫడ్నవీస్ కు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఏమైనా జయప్రదమైన మార్గాలను చెబుతున్నారా.. ఇలాంటి లీకులు ఏమీ లేవు. చంద్రబాబు సలహాలు ఇవ్వకపోవడం వల్లనే అక్కడ రాజకీయం అలా తయారైనట్టుగా ఉందని చంద్రబాబు నాయుడు అభిమానులు వాపోతున్నారట! ఏదేమైనా చంద్రబాబు రంగంలోకి దిగాల్సిందే అని ఆ వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయని సమాచారం!