మహారాష్ట్ర రాజకీయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ పవార్ ను బీజేపీ వైపు నుంచి వెనక్కు రప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి ఎన్సీపీ, శివసేనలు. ఈ క్రమంలో ఆయనకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా సమాచారం. అదేమిటంటే.. ముఖ్యమంత్రి పదవి!
కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనల కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పీఠం ఐదేళ్లూ తమకే దక్కాలని ఠాక్రేలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవి తమకని, కాంగ్రెస్-ఎన్సీపీలకు ఉపముఖ్యమంత్రి పదవులు అని సేన ఒప్పందాన్ని రెడీ చేసుకుంది. దానికి ఆ పార్టీలు కూడా ఓకే చెప్పినట్టుగానే వ్యవహరించాయి. అంతలోనే అజిత్ పవార్ ట్విస్ట్ ఇచ్చారు.
దేవేంద్ర ఫడ్నవీస్ తో వెళ్లి డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆ ప్రభుత్వం ఇంకా బలపరీక్షను ఎదుర్కొనాల్సి ఉంది. ఇంతలోనే అజిత్ పవార్ కు శివసేన నుంచి కొత్త ఎర పడిందని సమాచారం. కావాలంటే ఎన్సీపీకి రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి సేన రెడీ అంటోందట. అప్పుడు ఆ అవకాశాన్ని అజిత్ పవార్ కే దక్కవచ్చని కూడా సేన ఊరిస్తోందట.
ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వస్తే, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగానే అవకాశం ఇస్తామంటూ శివసేన ఆఫర్ ఇస్తున్నట్టుగా ఉంది. మరి ఈ ఎరకు అజిత్ పవార్ పడతాడా? రాజీనామా చేసి తిరిగి పాత గూటికి చేరతాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం.