అప్పుడు గ్రాఫిక్స్ చేశాం, ఇప్పుడు ప్రింట్ వేశాం

ఇప్పటివరకూ గ్రాఫిక్స్ లో, గాల్లో మాత్రమే చంద్రబాబు చూపించిన రాజధానికి ఎట్టకేలకు భారతదేశ చిత్రపటంలో చోటు దక్కిందంటూ 2 రోజులుగా టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. వైసీపీ ఎంపీలెవరూ చేయని పనిని మా గల్లా జయదేవ్…

ఇప్పటివరకూ గ్రాఫిక్స్ లో, గాల్లో మాత్రమే చంద్రబాబు చూపించిన రాజధానికి ఎట్టకేలకు భారతదేశ చిత్రపటంలో చోటు దక్కిందంటూ 2 రోజులుగా టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. వైసీపీ ఎంపీలెవరూ చేయని పనిని మా గల్లా జయదేవ్ చేశారంటూ చంకలు గుద్దుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇది ఏపాటి విజయమో, దీనికి ఏపాటి ప్రచారం దక్కుతుందో చూస్తుంటే ప్రచారం కోసం మరీ ఇంత దిగజారాలా అనిపించక మానదు.

కేవలం మ్యాప్ లో ప్రింట్ చేసినంత మాత్రాన అమరావతి అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసినట్టు సంబరపడిపోతోంది పచ్చబ్యాచ్(లోకేష్ తో సహా). ఇక ఈ ప్రగల్భాలకు పరాకాష్ట ఏంటంటే.. ట్విట్టర్లో ఈ పనికి కులాన్ని కూడా ఆపాదిస్తున్నారు. కల్తీ రెడ్ల రాజ్యంలో కమ్మవారి విజయం అంటూ ఓ కార్యకర్త అత్యుత్సాహంతో పెట్టిన పోస్టింగ్ ని ఎంపీ గల్లా జయదేవ్ కూడా రీట్వీట్ చేశారు.

రాజకీయాల్లో, అభివృద్ధిలో ఇలాంటి కుల ప్రస్తావన తీసుకురావద్దంటూ జయదేవ్ చెప్పుకొచ్చారు కానీ, అసలీ పోస్టింగ్ కి ఆయన అంత ప్రాధాన్యం ఇవ్వాలా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆయన రీట్వీట్ చేయకుండా వదిలేస్తే బాగుండేది. పైకి ఖండిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చినా, కేవలం వైసీపీని రెచ్చగొట్టేందుకే ఈ ట్వీట్ ని జయదేవ్ రీట్వీట్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది.

పోనీ ఇది జయదేవ్ సాధించింది విజయమే అనుకుందాం. ముగ్గురు ఎంపీలతోనే టీడీపీ ఈ విజయాన్ని సాధించిందని సంతోషిద్దాం. మరి కేంద్రంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నప్పుడు టీడీపీ ఏం చేసింది? అమరావతికి నిధులు ఎందుకు విడుదల చేయించుకోలేకపోయింది, కనీసం 10 శాతం పనులైనా రాజధానిలో ఎందుకు పూర్తికాలేదు? కేవలం రియల్ ఎస్టేట్ బిజినెస్ కి, ఎంఓయూల వరకే రాజధాని ప్రాజెక్ట్ ఎందుకు పరిమితం అయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటే బాగుంటుంది.

ఒకరకంగా చెప్పాలంటే, తన ఐదేళ్ల అసమర్థతను చంద్రబాబు ఈ సందర్భంగా మరోసారి ఒప్పుకున్నట్టయింది. పైగా ఈ మొత్తం ప్రహసనానికి కొసమెరుపు ఏంటంటే.. త్వరలోనే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తారట. రైతుల సమస్యలు తెలుసుకుంటారట, రాజధాని అభివృద్ధిని చూస్తారట. ఇదీ బాబు రాజకీయం.