బిత్తిరి సత్తి టీవీ9లోకి వచ్చేశాడు. శివజ్యోతి బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిపోయింది.
దీంతో తీన్మార్ అనే కార్యక్రమం ఆగిపోయింది. సూపర్ హిట్ అయిన వీళ్లిద్దరి కాంబినేషన్ ను ఇక చూడడం జరగదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా శివజ్యోతి టీవీ9లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె రాకను తెలియజేస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది ఆ ఛానెల్.
సో.. టీవీ9 వేదికగా బిత్తిరి సత్తి, శివజ్యోతి మళ్లీ కలవబోతున్నారన్నమాట. తీన్మార్ స్థానంలో ఇస్మార్ట్ న్యూస్ అనే కార్యక్రమం కలిసి చేయబోతున్నారన్నమాట. ఇన్నాళ్లూ శివజ్యోతి లేని లోటును సంధ్య అనే యాంకర్ తో భర్తీ చేసింది టీవీ9. ఇప్పుడు ఏకంగా శివజ్యోతినే రంగంలోకి దించుతోంది.
తీన్మార్ లో సావిత్రి పేరుతో పాపులర్ అయిన శివజ్యోతికి ఈసారి మరో కొత్త స్క్రీన్ నేమ్ ను తగిలించబోతున్నారు. బిత్తిరి సత్తి కాస్తా ఇస్మార్ట్ సత్తిగా మారినట్టు.. సావిత్రి కూడా మరో పేరులోకి మారబోతోంది.
అంతా బాగానే ఉంది కానీ,, ఈ కాంబినేషన్ మరోసారి రేటింగ్స్ కురిపిస్తుందా అనేది అందరి డౌట్. తీన్మార్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఇస్మార్ట్ న్యూస్ తో బుల్లితెర వీక్షకుల ముందుకొచ్చిన చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. రేటింగ్స్ అంతంతమాత్రంగానే వస్తున్నాయి. కనీసం సావిత్రి రాకతోనైనా ఈ కార్యక్రమం ఊపందుకుంటుందేమో చూడాలి.