ప్రాధమిక విద్య స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి స్పందన అవునో కాదో గానీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక సభలో మాతృభాష ప్రాధాన్యం గురించి చెప్పారు. ఆ వెంటనే చాలా సీరియస్ గా స్పందించిన జగన్, వెంకయ్య పిల్లలు తెలుగు మీడియం లో చదివారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు జగన్, ప్రధాని మోడీపై కూడా అలాంటి సెటైర్లు వేస్తారా? మోడీకి పిల్లలు లేరు గనుక మరోరకం సెటైర్ వేస్తారా?
ఎందుకంటే.. ఇప్పుడు మోడీ, గతంలో వెంకయ్య మాటల కంటే ఘనంగా మాతృభాషాలను, పైపెచ్చు యాసలను వెనకేసుకొస్తున్నారు. 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరంగా ఐరాస ప్రకటించిందట. ఆ విషయాన్ని మోడీ ప్రత్యేకంగా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించి మాతృ భాషలను, తల్లి భాషలోని యాసలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
వెంకయ్య కంటే ఒక అడుగు ముందుకేసి… తల్లి భాషను కాపాడుకోకుండా ఎంత అభివృద్ధి సాధించినా సరే.. అలాంటి అభివృద్ధి సమజానికి మంచిది కాదని కూడా హితవు చెప్పారు. ఆయన ప్రత్యేకంగా ఏపీ పరిణామాలను ఉద్దేశించలేదుగానీ ఆ మాటలన్నీ రాష్ట్రంలో ప్రస్తుతం రేకెత్తి ఉన్న వివాదానికి అచ్ఛంగా సరిపోయేవే.
పేదలకు అందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ ప్రయత్నంలో తెలుగు మీడియం ను పూర్తిగా ఎత్తివేయడం మీదనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ఏమిటనే కనీస అవగాహన కూడా లేకుండా.. అవాకులు చెవాకులు పేలుతున్నాయి. ప్రజల్లో ఎక్కడా వ్యక్తం కాని వ్యతిరేకతను వారిలో పాదుగొల్పడనికి ప్రయత్నిస్తున్నాయి.
జగన్ మాత్రం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నారు. పునరాలోచన లేదంటున్నారు. అయితే ఇపుడు ప్రధాని మోడీ మాటల నేపథ్యంలో జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆ మాటలు జగన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్లే ఉన్నాయి. మరి జగన్ కౌంటర్ ఇవ్వగలరా?