అవుని మరి కమలనాధులకు ఎక్కడో కాలింది. ఆ పార్టీ ప్రెసిడెంట్ సోము వీర్రాజుని హౌస్ అరెస్ట్ చేయగానే కోపం కట్టలు తెంచుకున్నట్లుంది. అంతర్వేధిలో రధం తగులబడడం దారుణమైన ఘటనే. దాన్ని అంతా ఖండించాల్సిందే.
కానీ అగ్గిలో ఆజ్యం పోద్దామని ఆ మంటల్లో కాచుకుందామని విపక్షాలు వేస్తున్న ఎత్తులు, చేస్తున్న విన్యాసాలే జుగుప్సను కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తుంది. అందులోనూ సున్నితమైన మత పరమైన అంశాలు ఉన్నపుడు ఇంకా జాగ్రత్తగా ఉంటుంది.
అందులో భాగంగా హౌస్ అరెస్టులు చూడాలి. కానీ కాషాయం పార్టీ వారికి మాత్రం ఈ పరిణామాలు కషాయం తాగించినట్లుగా ఉన్నాయేమో. అంతే ఒక్కోక్కరుగా బీజేపీ నేతలు జగన్ సర్కార్ మీద నోరు పారేసుకుంటున్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే జగన్ సర్కార్ మీద తమకు నమ్మకనే లేదనేశారు. సీబీఐ విచారణను జరిపించాలని, అంతర్వేది ఘటన మీద అంతవరకూ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇక మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే మరో అడుగు ముందుకేసి జగన్ సర్కార్‌ని ఏకంగా గద్దె దినేస్తామని గట్టిగానే మాట్లాడుతున్నారు. అన్ని పార్టీలను కలుపుకుని వైసీపీ సర్కార్ ని ఇంటికి పంపుతామని అంటున్నారు.
ఏపీ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క సీటూ లేదు, ఇక టీడీపీకి పేరుకు 23 ఉన్నా ఎంతమంది చంద్రబాబు వైపు ఉన్నారో తెలియదు, జనసేనకు ఉన్న ఒకే ఒక్కడూ జగన్ కి జై కొడుతున్నారు. మరి ఎమ్మెల్యేగా పనిచేసిన రాజు గారికి ఈ లెక్కలు తెలియవా. లేకపోతే 151 సీట్లతో బలంగా ఉన్నా వైసీపీ సర్కార్‌ని అది కూడా 15 నెలల పాలన మాత్రమే పూర్తి అయిన ప్రభుత్వాన్ని ఇప్పటికిపుడు గద్దె దింపుతామని గర్జించడం చూస్తూంటే బాబును కూడా మించిపోయారేమో అనిపించకమానదుగా.